గతేడాది కరోనా మహమ్మారి కన్నా ముందే పార్లమెంట్ ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)పై ముందుకే వెళ్లనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
మార్గదర్శకాల రూపకల్పన కోసం నియమించిన సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీలకు లోక్‌సభలో ఏప్రిల్ 9 వరకు, రాజ్యసభలో జూలై 9 వరకు గడువు పొడిగించినట్టు వెల్లడించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లలో అణచివేతకు గురైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు.
కాగా, ఓబీసీల రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ అమలుకు ఆదాయ పరిమితిని ప్రాతిపదికగా తీసుకొంటున్న విధానాన్ని సమీక్షిస్తున్నామని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జర్ లోక్‌సభలో వెల్లడించారు.
ప్రభుత్వ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వుడు పోస్టులు ఎందుకు భర్తీ కావటంలేదన్న అంశాన్ని పరిశీలించేందుకు కమిటీని వేశామని మరో మంత్రి రతన్‌లాల్ కటారియా తెలిపారు. హైదరాబాదీ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా కరోనా వైరస్‌పై అద్భుతంగా పనిచేస్తున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే తెలిపారు.
కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలల్లో తెచ్చినట్టుగా దేశవ్యాప్తంగా మత మార్పిడి నిరోధ చట్టం తెచ్చే ఆలోచన లేదని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. దేశంలో ఎక్కడైనా బలవంతపు మత మార్పిడులు జరిగితే పోలీసులే తగిన చర్యలు తీసుకొంటారని లోక్‌సభలో హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ అంశం రాష్ట్రాల పరిధిలోనిదని గుర్తుచేశారు.
గణతంత్ర దినోత్సవం రోజు రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా విధ్వంసానికి దిగిన ఆందోళనకారులను అదుపుచేసేందుకు మరో మార్గం లేకనే పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించి, లాఠీచార్జీ చేయాల్సి వచ్చిందని చెప్పారు.
More Stories
ఈషా ఫౌండేషన్‌పై పోలీసుల చర్యలకు `సుప్రీం’ బ్రేక్
జార్ఖండ్‌లో హిందువులు, ఆదివాసీల జనాభా తగ్గిపోతుంది
రాజకీయ పార్టీ ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్