పోలీసులపై దాడి చేస్తే ఎవ్వరు ప్రశ్నించలేదే?

దేశ రాజధాని నగరం ఢిల్లీలో జనవరి 26న పోలీసులపై హింస జరిగినా ఎవరూ మాట్లాడటం లేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ విస్మయం వ్యక్తం చేశారు. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా దాదాపు 510 మంది పోలీసులు గాయపడ్డారని చెబుతూ ఈ సందర్భంగా రైతులపై తల్వార్లు, కర్రలు, రాళ్లతో దాడిచేసిన వారిని ఎవ్వరూ ప్రశ్నించలేదని, అయితే, ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లు నిర్మిస్తే మాత్రం ప్రశ్నిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.

ప్రజల్ని రక్షించడంతోపాటు మాకు మేము రక్షించుకోవడనాకి బలంగా బారికేడ్లు నిర్మిస్తున్నామే గానీ, రైతులపై ద్వేషంతో కాదని స్పష్టం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతు శిబిరాల వద్ద పెద్ద ఎత్తున బారికేడ్లను నిర్మించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రశ్న వేశారు.

జనవరి 26న ఢిల్లీలో ట్రాక్టర్లను ఉపయోగించారని, పోలీసులపై దాడులు చేశారని, బారికేడ్లను ధ్వంసం చేశారని, అయినప్పటికీ ఎవరూ ప్రశ్నించకపోవడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పారు. ఇప్పుడు తాము చేసినదేమిటని ప్రశ్నించారు. కేవలం బారికేడ్లను పటిష్టం చేశామని, మరోసారి బారికేడ్లను ధ్వంసం చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. 

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతుల శిబిరాల వద్ద బారికేడ్లను పెద్ద ఎత్తున నిర్మిస్తుండటంపై మీడియా ప్రశ్నించినపుడు శ్రీవాస్తవ ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసులు స్టీల్ లాఠీలను ఉపయోగిస్తున్నారని వస్తున్న వార్తలను ప్రస్తావించినపుడు, స్టీల్ లాఠీలు పోలీసుల ఆయుధాల్లో భాగం కాదని స్పష్టం చేశారు.

ఢిల్లీ సరిహద్దుల్లోని రైతుల నిరసన శిబిరాల వద్ద పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. నిరసన తెలుపుతున్న రైతులను కట్టడి చేయడం కోసం సింఘు సరిహద్దుల్లో జాతీయ రహదారిపై పటిష్టమైన బారికేడ్లను నిర్మించారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దులో తాత్కాలిక సిమెంట్ గోడను నిర్మించారు. ఘాజీపూర్ వద్ద ఢిల్లీ-ఉత్తర ప్రదేశ్ సరిహద్దులో అంచెలంచెలుగా బారికేడ్లను నిర్మించారు. 

ఇలా ఉండగా, ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా కొందరు పోలీసులకు  తీవ్రగాయాలు కాగా, మరికొందరు చికిత్స తీసుకుని ఇండ్లకు వెళ్లిపోయారని‌ శ్రీవాస్తవ తెలిపారు. పీఠంపురలో చికిత్స పొందుతున్న పోలీసులను శ్రీవాస్తవ పరామర్శిస్తూ వారి సేవలను కొనియాడారు.

రైతులు పెద్ద సంఖ్యలో దాడికి వచ్చినప్పటికీ బెదరకుండా శాంతిభద్రతలను కాపాడటంతో విద్యుక్త ధర్మాన్ని వీడకపోవడం హర్షణీయమని ప్రశంసించారు. గాయపడిన పోలీసులందరికీ ప్రభుత్వం చికిత్స అందిస్తున్నదని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.