వైఎస్సార్సీపీ నేతల మధ్య భగ్గుమన్న విబేధాలు  

కర్నూలులో వైఎస్సార్సీపీ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై విబేధాలు రావడంతో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌, పార్టీ నియోజకవర్గ వర్గ ఇన్‌చార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మంత్రుల సమక్షంలోనే బాహాబాహీకిదిగారు. మాటామాటా పెరగడంతో ఇద్దరి అనుచరులుఏకంగాకుర్చీలతోకొట్టుకునేందుకుయత్నించారు.

పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో స్థానిక పార్టీ నేతలతో మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి బొత్స సత్యనారాయణ,  ఆర్థిక, ప్రణాళిక, శాసన వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌‌, నీటి పారుదలశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ , కార్మికశాఖ మంత్రి గుమ్మనూర్‌ జయరామ్‌, ఎంపీ వేమిరెడ్డి సమావేశమయ్యారు.

స్థానిక ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సీట్ల కేటాయింపు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై చర్చించారు. పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌, పార్టీ ఇన్‌ఛార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మంత్రులు మాట్లాడుతుండగానే ఇద్దరు బాహాబాహీకి దిగారు. అనుచరులు మంత్రుల సమక్షంలోనే పరస్పరం కుర్చీలతో కొట్టుకునేందుకు యత్నించారు. మంత్రులు పోలీసులు నిలువరించడంతో గొడవ సర్దుమనిగింది. దీంతో సమావేశాన్ని మంత్రులు అర్ధాంతరంగా ముగించినట్లు తెలిసింది.

మరోవంక, నెల్లూరు జిల్లాలోని  కావలిలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో వైసీపీ నేత జంపాని రాఘవులు వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ప్రభుత్వ పథకాలు పొందినప్పుడు తమకెందుకు ఓట్లు వేయరంటూ బెదిరింపులకు దిగారు. ఓట్లు వేయకుంటే అంతుచూస్తామంటూ రాఘవులు దూషించారు.

 ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వైసీపీ నేతలపై స్థానికులు మండిపడుతున్నారు. అధికారబలంతో బెదిరింపులకు దిగుతున్నారని తప్పుబడుతున్నారు. తమకు నచ్చిన వారిని ఎన్నుకునే హక్కు ఉందని, ఇలా దూషించడం ఏమిటని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.