నిమ్మగడ్డపై సభ హక్కుల ఉల్లంఘన పక్రియ 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై వచ్చిన సభా హక్కుల ఉల్లంఘన ఆరోపణలను విచారించే పక్రియను అసెంబ్లీ హక్కుల కమిటీ ప్రారంభించింది. తమ హక్కులకు భంగం కలిగిందని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ఇచ్చిన నోటీసును స్వీకరించామని సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సభాహక్కుల కమిటీ సమావేశం జరిగింది. అసెంబ్లీ రూల్స్ ను, గతంలో మహారాష్ట్ర ఎస్ఈసీ ఉదంతాన్ని ఉదహరిస్తూ నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార వైసీపీ సభ్యులు వాదించగా, అది రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రతిపక్ష టీడీపీ సభ్యుడు ఎదురుదాడికి దిగారు.

ఈ సమావేశంలోనే నిమ్మగడ్డను షోకాజ్ నోటీసు ఇవ్వగలరని ముందుగా భావించినా ఇప్పటికే ఎన్నికల కమీషనర్ విషయంలో పలుసార్లు హైకోర్టు, సుప్రీం కోర్ట్ ల చివాట్లు తిన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనుకడుగు వేసినదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం అందరు ఎన్నికలలో తీరిక లేకుండా ఉన్నారని అంటూ కేవలం విచారణ చేపట్టాలని నిర్ణయించి, తీసుకొనే చర్యపై  నిర్ణయాన్ని వాయిదా వేశారు. 

మంత్రులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యాఖ్యలు, గవర్నర్ కు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలు ముమ్మాటికీ అభ్యంతరకరంగా ఉన్నాయని, అవి సభ్యుల హక్కులకు భంగకరంగానూ ఉన్నాయని ప్రివిలేజ్ కమిటీలోని వైసీపీ సభ్యులు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలోని రూల్‌ నెం 212, 213 కింద ఎస్‌ఈసీని ప్రివిలేజ్ కమిటీ ముందుకు పిలింపించవచ్చని వారు తెలిపారు. 

గతంలో మహారాష్ట్రలో కూడా ఇలానే చేశారని ప్రివిలేజ్‌ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కానీ ఈ వాదనతో టీడీపీ సభ్యుడు  విభేదించారు. ఎన్నికల సమయంలో కమిషనర్ కు విశేష అధికారాలు లభిస్తాయని, ఆర్టికల్‌ 243 ప్రకారం నిమ్మగడ్డకు సర్వాధికారాలు ఉన్నాయని, అలాంటప్పుడు ఆయనను ప్రివిలేజ్ కమిటీ ముందుకు ఎలా పిలిపిస్తారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు.

నిమ్మగడ్డకు నోటీసులు పంపే విషయమై వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరో వారంలోపే ఆన్‌లైన్‌లో కాకుండా నేరుగా సమావేశం కావాలని కమిటీ నిర్ణయయించింది. అంతేకాదు, ఎస్‌ఈసీ అంశం సున్నితమైనది కావడంతో దీనిపై విస్తృతంగా చర్చించాలని ప్రివిలేజ్‌ కమిటీ భావించింది.  

శాసనసభ నిబంధనలు 212, 213 కింద ఎవరినైనా పిలిచి విచారించడం లేదా, అవసరమైతే నోటీసులు జారీచేసే సంపూర్ణ హక్కులు ప్రివిలేజ్‌ కమిటీకి ఉన్నాయని కూడా కాకాణి స్పష్టంచేశారు. మంత్రుల ఫిర్యాదును అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాత కమిటీకి దీనిని విచారించే అధికారం ఉందని నిర్ధారించామన్నారు.

గతంలో మహారాష్ట్రలోనూ ఇలాగే జరిగిందని.. శాసనసభ్యులను కించపరిచారన్న ఆరోపణలపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అరెస్టు కూడా అయ్యారని గోవర్ధన్ రెడ్డి తదుపరి మీడియాకు తెలిపారు. అయితే,  ఎమ్మెల్సీకే సభా హక్కుల నిబంధన వర్తించదని గతంలో వాదించిన వైసీపీ నేతలు ఇప్పుడు అదే నిబంధనను ఎన్నికల కమిషనర్‌కు ఎలా వర్తింపజేస్తారని సత్యప్రసాద్‌ ప్రశ్నించారు. 

‘శివనాథరెడ్డి అనే టీడీపీ ఎమ్మెల్సీ వైసీపీలో చేరితే ఆయనపై మా పార్టీ సభా హక్కుల నోటీసు ఇచ్చింది. ఆయన్ను గవర్నర్‌ నియమించారు కాబట్టి.. సభా హక్కులు వర్తించవని అప్పుడు నాడు వైసీపీ వాదించారు’ అని వివరించారు. 

కాగా.. సభా హక్కుల ఉల్లంఘన ఎమ్మెల్యేలకే వర్తిస్తుందని, మంత్రులకు కాదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. విలా్‌సరావు దేశ్‌ముఖ్‌ మహారాష్ట్ర సీఎంగా న్నప్పుడు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై కక్షగట్టారని, ఆ రాష్ట్ర శాసనసభ కమిషనర్‌కు జైలు శిక్ష విధిస్తే మర్నాడే ఆయన విడుదలయ్యారని, అసెంబ్లీ చర్యను సాక్షాత్తూ సుప్రీంకోర్టే తప్పుబట్టిందని గుర్తు చేశారు.