విజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై దాడి 

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి పై దాడి జరిగింది. కొద్దిసేపటి క్రితం తన ఇంటి నుండి ఆఫీసుకు బయలుదేరగా సుమారు 10 మంది దుండగులు అడ్డగించి దాడి చేశారు. రాడ్డుతో దాడి చేయడంతో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పట్టాభికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. 

దుండగులు ఆయన సెల్ ఫోన్ ను ధ్వంసం చేసినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం రాత్రి ఆయన ఇంట్లోనే కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. తనను రాజకీయంగా ఎదుర్కోలేక బెదిరించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పట్టాభి ఆరోపించారు. తాజాగా ఇవాళ మరోసారి దాడి జరగడం సంచలనం రేపింది. 

ఉదయం తాను కార్యాలయానికి బయలుదేరే సమయంలో ఇంటికి దగ్గరలోనే దాదాపు 10 మంది కాపుగాసి, ఒక్కసారిగా కారును చుట్టుముట్టి రాడ్లు, కర్రలు, బండరాళ్లతో దాడులు చేశారని పట్టాభి తెలిపారు. తనపై దాడి చేశారని, కారును పూర్తిగా ధ్వంసం చేశారని చెప్పారు. డ్రైవర్‌పై కూడా దాడి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను బయటపెడుతున్నందుకే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. గత పదిరోజులుగా తనకు బెదిరింపులు వస్తున్నాయన్నాయన్నారు. ఈ విషయాన్ని మీడియా ముఖంగా పోలీసులకు తెలియజేశానని తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని కోరానని… అయినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు

ఒకవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అధికార పక్షాన్నితీవ్ర స్థాయిలో ఎండగట్టే పట్టాభిపై దాడి జరగడం కలకలం రేపుతోంది.  టీవీ ఛానెళ్ల చర్చల్లో అధికార వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద గొంతుతో మాట్లాడే పట్టాభిపై దాడి జరగడం ప్రత్యర్థుల పనేనా? లేక పాత కక్షలతో జరిగిందా ? అనేది తెలియాల్సి ఉంది. దాడి పట్ల తెలుగుదేశం  పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.