హత్యాయత్నం కేసులో అచ్చెన్నాయుడుఅరెస్టు 

హత్యాయత్నం కేసులో అచ్చెన్నాయుడుఅరెస్టు 

శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఎపి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన స్వగృహంలో అచ్చెన్నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కోటబొమ్మాళి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

పంచాయతీ నామినేషన్‌ సమయంలో వైసిపి అభ్యర్థి అప్పన్న పై హత్యాయత్నం చేసినట్టు అచ్చెన్నాయుడి పై అభియోగం నమోదయింది. అచ్చెన్నాయుడితోపాటు మరో 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 30 మందిపై కేసులు నమోదయ్యాయి. అచ్చెన్నాయుడి సోదరుడు హరి ప్రసాద్‌, కుమారుడు సురేష్‌ ల పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.

నిమ్మాడ లో అచ్చెన్నాయుడి సోదరుడి కొడుకు సురేష్‌ నామినేషన్‌ వేయడంతో గొడవ మొదలయింది. వైసిపి సర్పంచ్‌ అభ్యర్థిగా అచ్చెన్నాయుడి బంధువు అప్పన్న బరిలోకి దిగారు. నిమ్మాడ లో ఏకగ్రీవ ఎన్నిక కోసం అచ్చెన్నాయుడు ప్రయత్నించారు. అప్పన్నను అచ్చెన్నాయుడు ఫోన్‌లో బెదిరించారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఎ 1 కింజారపు హరిప్రసాద్‌, ఎ 2 కింజారపు సురేష్‌, ఎ 3 అచ్చెన్నాయుడు, ఎ 4 గా కింజారపు లలితకుమారి సహా 22 మందిపై కేసులు నమోదయ్యాయి.

మరోవంక, నేడు నిమ్మాడ లో వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో.. అచ్చెన్నాయుడి అరెస్టు చర్చనీయాంశమైంది. అచ్చెన్నాయుడి అరెస్టుతో నిమ్మాడకు జిల్లా నలుమూల నుండి టిడిపి శ్రేణులు చేరుకుంటున్నారు.

విజయసాయిరెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా నిమ్మాడలో ఎటువంటి సంఘటనలు తెలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. నిమ్మాడ లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని నిమ్మాడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు