కీలక రంగాలలో పెట్టుబడుల ఉపసంహరణపై `స్వదేశీ’  ఆందోళన 

ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కరోనా మహమ్మారి  అనంతరం దేశ ఆర్ధిక వ్యవస్థను వృద్ధి బాటలో నడిపించడానికి, పెట్టుబడులకు, ఉపాధి అవకాశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, మొదటగా వైద్య రంగానికి భారీ కేటాయింపులు జరపడం పట్ల హర్షం ప్రకటిస్తూనే కీలక రంగాలలో పెట్టుబడుల ఉపసంహరణ పట్ల స్వదేశీ జాగరణ్ మంచ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 

బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, పవన్ హన్స్, భారత్ ఎర్త్ మొవర్స్ వంటి కీలక ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు మెట్రోలకు రోలింగ్ స్టాక్ ఉత్పత్తులలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం పట్ల మంచ్ జాతీయ సహా కన్వీనర్ డా. అశ్వని మహాజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

అదే విధంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక భీమా కంపెనీని ప్రైవేట్ పరం చేస్తామని చేసిన ప్రకటన పట్ల కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి కీలక రంగాలలో వ్యూహాత్మక పెట్టుబడులకు వెళ్లడం కన్నా వాటి పనితీరు మెరుగు పరచడం పట్ల దృష్టి సారించాలని ఆయన హితవు చెప్పారు. ఆ తర్వాతనే వాటి ఈక్విటీ లలో పెట్టుబడులు ఉపసంహరించుకో వచ్చని చెప్పారు.

పన్ను చెల్లింపు దారుల డబ్బుతో సృష్టించిన రంగాలలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ సహేతుకారం కాబోదని డా. మహాజన్ స్పష్టం చేశారు. వాటి పనితీరును మెరుగు పరచిన తర్వాత ఈక్విటీ మార్గంలో అమ్మకం పెట్టడం ఎంతో  పారదర్శకంగా, లాభదాయకంగా ఉంటుంది ఆయన పేర్కొన్నారు. 

మరోవంక, భీమా రంగంలో ఎఫ్డిఐ పరిమితిని 49 శాతం నుండి 74 శాతంకు పెంచడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్ధిక రంగంలో విదేశీ ఆధిపత్యం పెరగడం  హర్షణీయం కాదని స్పష్టం చేశారు. అటువంటి చర్యలు దేశ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయని ఆయన హెచ్చరించారు. 

అయితే ఈ బడ్జెట్ 6.8 శాతం ద్రవ్య లోటు చూపుతున్నా కేవలం అత్యధిక జిడిపి  వృద్ధికి దోహద పడడమే కాకుండా కరొనతో కోల్పోయిన ఉద్యాగాలు తిరిగి పొందడానికి దారితీస్తుందని డా. మహాజన్ విశ్వాసం వ్యక్తం చేశారు.  మౌలిక సదుపాయాలకు ఎక్కువ నిధులు కేటాయించడం, నూతన ప్రాజెక్ట్ లను ప్రకటించడం, కరోనా ప్రభావంతో మూతబడిన పరిశ్రమలను తెరిచేందుకు ప్రయత్నించడం, ఆరోగ్యంపై అనూహ్యంగా 137 శాతం ఎక్కువ నిధులు కేటాయించడం, పరిశోధన- అభివృద్ధిలకు మరిన్ని నిధులు కేటాయించడం వంటి బడ్జెట్ ప్రతిపాదనల పట్ల ఆయన హర్షం ప్రకటించారు. 

దేశంలో తయారు రంగం పునరుద్దరణకు ఉత్పత్తితో  సంబంధం గల ప్రోత్సాహకాలు రూ 1.97 కోట్లు కేటాయించడం తోడ్పడుతుందని ఆయన చెప్పారు. అభివృద్ధి ఆర్ధిక సంస్థ ఏర్పాటుకు రూ 20,000 కోట్లు కేటాయించడం పట్ల కూడా ఆయన సంతోషం వ్యక్త పరచారు. కాపిటల్ వ్యయంపై కేటాయింపులు రూ 4.12 లక్షల కోట్ల నుండి రూ 5.54 లక్షల కోట్లుకు పెంచడం కూడా అభినందనీయమని తెలిపారు.  రైల్వేలకు రూ 1.07 లక్షల కోట్లతో పాటు రహదారులకు రూ 1.08 లక్షల కోట్లు , మెట్రో, జలరవాణా, ఓడలు, పెట్రోలియం,  సహజవాయువులకు కూడా విశేషంగా కేటాయింపులు జరిపారని డా.  మహాజన్ కొనియాడారు.