మయన్మార్ సైనిక తిరుగుబాటు వెనుక చైనా!

మయన్మార్ సైనిక తిరుగుబాటు వెనుక చైనా!
మయన్మార్ లో ఆ దేశాధ్యక్షుడితో పాటు ఆంగ్ సాన్ సూకీ, ఇత‌ర నేత‌ల‌ను సోమవారం ఉద‌యం అరెస్టు చేసి,  ఏడాది పాటు దేశంలో ఎమ‌ర్జెన్సీ ఉంటుంద‌ని ఆ దేశ సైన్యం ప్రకటించడం వెనుక చైనా హస్తం ఉండవచ్చనే అనుమానాలు చెలరేగుతున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌లను వివాదాస్పదమని ప్రకటిస్తూ, సైన్యం ప్ర‌భుత్వాన్ని ఆధీనంలోకి తీసుకున్న‌ట్లు ప్రకటించిన సైన్యం  దేశ ఉపాధ్య‌క్షుడు మింట్ స్వేను  తాత్కాలిక అధ్య‌క్షుడిగా  ప్రకటించింది.  క‌మాండ‌ర్ ఇన్ చీఫ్ మిన్ ఆంద్ హ‌యింగ్‌కు అన్ని అధికారాల‌ను బ‌దిలీ చేశారు.
మ‌య‌న్మార్ సైన్యాన్ని బ‌ర్మీస్ భాష‌లో త‌త్మ‌దా అని పిలుస్తారు.  రాజ‌కీయ ప‌రిస్థితి స‌రిగా లేని కార‌ణంగా  దౌత్య‌ప‌ర‌మైన ప్ర‌క‌ట‌న‌లు ఏవీ చేయ‌కూడ‌ద‌ని త‌త్మ‌దా ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. 2015 వరకు ఐదు దశాబ్దాల పాటు అక్కడ తాత్మదా పాలనయే కొనసాగింది. 2015లో జరిగిన ఎన్నికలలో   ఆంగ్ సాన్ సూకీకి చెందిన నేష‌న‌ల్ లీగ్ ఫ‌ర్ డెమోక్ర‌సీ పార్టీ (ఎన్ఎల్డి) ఘన విజ‌యం సాధించింది.  
 
అంతర్జాతీయ వత్తిడిలకు లొంగి 2008లో రూపొందించిన ఆ దేశ రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ లో 25 శాతం సీట్లను తాత్మదాకు రిజర్వు చేశారు. దానితో ప్రజల మద్దతుతో అధికారం చేపట్టిన సూకీకి అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తూ వచ్చారు. తాజాగా, గ‌త న‌వంబ‌ర్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూడా ఆమె పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 476 సీట్లు  ఉండగా, ఆమె పార్టీ 396 సీట్లు గెలుపొందింది. సైన్యం మద్దతుతో పోటీ చేసిన యుఎస్డిపి కేవలం 33 సీట్లను మాత్రమే గెలుపొందింది. 
 
అయితే ఎన్నికల ఫలితాలు రాగానే ఆ పార్టీ ఎన్నికలలో ఎన్నో అక్రమాలు జరిగాయని అంటూ ఆరోపణలు చేయడం ప్రారంభించింది. ఎన్నికలలో అక్రమాలపై ఒక కోటికి పైగా ఫిర్యాదులు నమోదు చేశారు. ఓటర్ల జాబితాలలో లక్షలాది నకిలీ పేర్లు, ఒకే పేరు పలు సార్లు రావడం జరిగిన్నట్లు ఆరోపిస్తూ వచ్చారు. 
 
2011లో సైనిక పాల‌న ముగిసిన త‌ర్వాత, రెండ‌వ‌సారి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించారు.  ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై సైన్యం  అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.  దేశాధ్య‌క్షుడితో పాటు ఎన్నిక‌ల సంఘంపై సుప్రీంకోర్టులో సైన్యం కేసు వేసింది. ఎన్నిక‌ల సంఘం మాత్రం ఆ ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేసింది. పైగా, అంతర్జాతీయ పరిశీలకులు సహితం ఆ ఆరోపణలను ఖండించారు.
ఆ దేశంలో 90కి పైగా రాజకీయ పార్టీలు ఎన్నికలలో పోటీ చేయగా, 17 పార్టీలు మాత్రమే ఎన్నికలలో అక్రమాలు జరిగిన్నట్లు ఆరోపణలు చేశారు. యుఎస్డీపీ తప్ప మిగిలిన వన్నీ చాలా  చిన్న, చిన్న పార్టీలు. వాటిల్లో షాన్ నాషనలైటిస్ డెమోక్రాటిక్ పార్టీ, కాయిన్ పెఒప్లెస్ పార్టీ లకు బీజింగ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఆరోపణలు చేయడంలో వారు ముందున్నారు.
మయన్మార్ లోని ఒకొక్క తెగకు ప్రతినిధ్యం వహిస్తున్న చిన్న, చిన్న పార్టీలతో, ముఖ్యంగా చైనాలోని యునాన్ ప్రావిన్స్ కు సరిహద్దులో గల దేశం తూర్పు భాగంలోని పార్టీలతో సన్నిహిత సంబంధాలున్నాయి.
తమ ప్రాంతాలపై విస్తృతమైన స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేస్తున్న ఇటువంటి పార్టీలు, వాటికి చెందిన తీవ్రవాద బృందాలకు చైనా ఆయుధాలు, వనరులు సమకూరుస్తుంది. ఒక వంక తాత్మడా తో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకొంటూనే, మరోవంక సైన్యంపై వ్యతిరేకంగా పోరాడుతున్న తీవ్రవాద బృందాలకు కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నది. 
 
మయన్మార్ అంతర్గత శాంతి ప్రక్రియలో సహితం వివిధ తెగలకు చెందిన తీవ్రవాద బృందాలు లేవనెత్తే అంశాలను మద్దతు తెలుపుతూ చైనా ఎక్కువగా జోక్యం చేసుకొంటున్నది. శాంతి సంప్రదింపులతో చైనా ప్రతినిధులు పాల్గొంటూ శాంతియుత పరిష్కారంలో కీలక భూమిక వహిస్తున్నారు. 
 
మొన్నటి ఎన్నికలలో యుఎస్డీపీ, కొన్ని చిన్న పార్టీలు గణనీయ సంఖ్యలో సీట్లు గెల్చుకొని, తాత్మడా నామినేట్ చేసే 25 శాతం మంది సభ్యులతో  ప్రభుత్వం ఏర్పాటు చేయగలవని చైనా అంచనా వేసింది. అటువంటి ప్రభుత్వం చైనా అనుకూల విధానం అనుసరించేటట్లు చేయవచ్చని ఎదురు చూసింది. 
 
అయితే ఎంఎల్డి ఘన విజయం సాధించడంతో బీజింగ్ ప్రణాళికలు తలకిందులు కావడంతో ఎన్నికలలో అక్రమాలు జరిగిన్నట్లు వివాదం లేవనెత్తి, సైనిక పాలన వచ్చేటట్లు చేసిన్నట్లు పలువురు భావిస్తున్నారు. 
 
మయన్మార్ లో మౌలిక సదుపాయాలు, నగరాలు, ఓడరేవులు, ఇంధన ప్రాజెక్ట్ లలో లక్షలాది డాలర్లు ఖర్చు పెడుతున్నది. మయన్మార్ పెట్టుబడులతో చైనాకు మాత్రమే  లభించే విధంగా ఈ ప్రాజెక్ట్ ల రూపకల్పన జరుగుతున్నది. తమ దేశంలో చైనా ప్రాజెక్ట్ లకు పెట్టుబడులు పెట్టడం కోసం తమ దేశం నుండే ఎక్కువ వడ్డీ రేట్లతో రుణాలు తీసుకోమని చైనా మయన్మార్ ప్రభుత్వంపై వత్తిడి తీసుకు వస్తున్నది.
 
శ్రీలంక లోని హంబంతోట పోర్ట్ ప్రాజెక్ట్ లో చేసిన విధంగా మయన్మార్ అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి, చైనాకు భారీ ప్రయోజనం కలిగేటట్లు చేయడమే వారి ఉద్దేశం. అయితే ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డి ప్రభుత్వం చైనా ఎత్తుగడలను మొదటి నుండి వ్యతిరేకిస్తున్నది. కొన్ని ప్రాజెక్ట్ లను కూడా నిలిపి వేసింది. పైగా మయన్మార్ లో చైనా పెట్టుబడులపై తీవ్రమైన నిఘా ఏర్పాటు చేసింది. అనేక  అక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చి చైనాను ఇరకాటంలో పడవేసింది. 
 
మరోవంక ఆ దేశంలో పలు కీలక వ్యాపార సంస్థలను ఆధీనంలో ఉంచుకున్న తాత్మడా సహితం తమ సంస్థలలోని ఆర్ధిక అక్రమాలను వెలుగులోకి తీసుకు వస్తుండటం పట్ల సూకీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నది. వీరి ప్రాజెక్ట్ లలో చాల వాటికి చైనా లోని కార్పొరేషన్ లతో సన్నిహిత సంబంధాలున్నాయి. సైన్యం కూడా తమ ఆర్ధిక ప్రాజెక్ట్ లలో పారదర్శకత,  జవాబుదారీతనం అమలు చేయాలనీ సూకీ వత్తిడి తెస్తూ ఉండడం వారికి ఆగ్రహం కలిగిస్తూ వస్తున్నది. 
 
తమ ఆర్ధిక ప్రయోజనాలపై మరిన్ని ఆంక్షల ద్వారా సూకీ ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరింప గలదని ఆమె తిరిగి అఖండ విజయం ఎన్నికలలో సాధించడంతో ఒక వంక చైనా, మరోవంక తత్వడా ఆందోళన చెందారు. మరోవంక సూకీ భారత్ తో స్నేహపూర్వకంగా వ్యవహరించడం సహితం చైనాకు ఆగ్రహంకు దారితీసింది. ఇవ్వన్నీ కలిసి సైనిక తిరుగుబాటుకు దారితీసిన్నట్లు కనిపిస్తున్నది.