రుణాల ఊబిలో కూరుకుపోయిన జగన్ ప్రభుత్వం

‘‘ఏపీ రుణాల ఊబిలో కూరుకుపోయింది. తన ఖర్చులకు ఎక్కువగా కేంద్రంపైనే ఆధారపడుతోంది. సొంత ఆర్థిక వనరులను ఏర్పర్చుకోవడంలో విఫలమైంది’’ అని 15వ ఆర్థిక సంఘం  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆర్ధిక నిర్వహణపై  తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం పార్లమెంట్‌లో ఈ నివేదికను ప్రవేశపెట్టారు.

నగదు ప్రవాహం విషయంలో రాష్ట్రం చాలా తీవ్ర పరిస్థితి ఎదుర్కొంటోందని, తరచూ వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సులకు, అప్పుడప్పుడు ఓవర్‌ డ్రాప్ట్‌లకు వెళ్లాల్సి వస్తోందని విమర్శించింది. 2019 సంవత్సరానికి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో 29.8 శాతం మేరకు కట్టాల్సిన అప్పులు పేరుకుపోయాయని పేర్కొంది. రెవెన్యూ వ్యయంలో జీతాలు, వడ్డీ చెల్లింపులు, పింఛన్లకే 47.6 శాతం ఏపీ  చెల్లించాల్సి వస్తోందని తెలిపింది. 

ఏపీ అప్పులు, లోటు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. జీఎస్డీపీలో ఏపీ ఆర్థిక క్రమశిక్షణ 2015-16లో 3.7 నుంచి 2018-19లో 4.1 శాతానికి పెరిగిందని గుర్తుచేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం విధించిన లక్ష్యాలను కూడా ఏపీ పాటించడం లేదని తెలిపింది. రాష్ట్ర రెవెన్యూలో 50 శాతం కేంద్రం నుంచేనని విమర్శించింది. సొంత వనరుల నుంచి రాష్ట్రం మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని హితవు చెప్పింది.

ఏపీలోని విద్యాసంస్థల్లో ఫలితాలు జాతీయ సగటు కంటే   కనిష్ఠంగా ఉన్నాయని, రోజురోజుకూ ఈ ఫలితాలు క్షీణిస్తున్నాయని 15వ ఆర్థిక సంఘం పేర్కొంది. రాష్ట్రంలో 64 ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా, వాటిలో 9 సంస్థలు రూ.25,367 కోట్లతో తీవ్ర నష్టాలతో నడుస్తూ ప్రజాధనాన్ని హరిస్తున్నాయని తెలిపింది 

అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు వివిధ రంగాల్లో ఆర్థిక పునర్నిర్మాణం చేస్తుండగా, రాష్ట్రం ఇంకా వ్యవసాయం, అడవులు, మత్స్య పరిశ్రమలపై ఆధారపడుతోందని, రాష్ట్ర రెవెన్యూలో వీటి నుంచే 35 శాతం ఆదాయం లభిస్తోందని తెలిపింది. రాష్ట్రం తన ఆర్థిక పునాదిని విస్తరించి ఆహారోత్పత్తి పరిశ్రమల సహా వివిధ రంగాలను అభివృద్ధి పరుచుకోవాలని సూచించింది.

అత్యంత కీలక రంగాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ తలసరి వ్యయం అత్యంత తక్కువగా ఉందని పేర్కొంది. ఏపీలో రహదారులు, వంతెనలు, భవనాల నిర్మాణానికి రూ.240, అటవీ, పర్యావరణ రంగానికి  రూ.53, నీటి సరఫరా, పారిశుధ్యానికి రూ.223 మాత్రమే తలసరి వ్యయం పెడుతున్నారని తెలిపింది.

రాజ్యాంగ నిబంధనల మేరకు ఏర్పర్చాల్సిన ఫైనాన్స్‌ కమిషన్‌ను ఏపీలో 2018లో పునర్వ్యవస్థీకరించినప్పటికీ ఇంతవరకూ నివేదికను సమర్పించలేదని 15వ ఆర్థిక సంఘం విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్‌ కమిషన్‌కు సంబంధించి రాజ్యాంగ నిబంధనలను పాటించడం లేదని ఆక్షేపించింది. ఫైనాన్స్‌ కమిషన్‌లను ఏర్పాటు చేయని రాష్ట్రాలకు వచ్చే గ్రాంట్లు నిలిపివేస్తామని హెచ్చరించింది. 

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలో ఏపీ 3వ స్థానంలో ఉన్నప్పటికీ, ఆకలి లేని రాష్ట్రంగా మార్చడంలో లక్ష్యాలను చేరుకోలేకపోయింది. ఈ విషయంలో ఏపీ 18వ స్థానంలో ఉందని ఆర్థిక సంఘం పేర్కొంది. కాగా, నీటి యాజమాన్య నిర్వహణలో ఏపీ మంచి పద్ధతులను పాటించిందని 2వ స్థానం నిలిచిందని ఆర్థిక సంఘం ప్రశంసించింది.

2021-26 సంవత్సరాల్లో ఏపీకి రూ.2,34,013 కోట్ల నిధులు గ్రాంట్ల రూపంలో పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. అలాగే, రెవెన్యూ లోటు కింద గ్రాంట్ల రూపంలో ఏపీకి ఐదేళ్లలో రూ.30,947 కోట్లు లభిస్తాయి. 

2021-22 సంవత్సరానికి రూ.17,257 కోట్లు, 2022-23 సంవత్సరానికి రూ.8,000 కోట్లు, 2023-24 సంవత్సరానికి రూ.5,690 కోట్లు లభిస్తాయి. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఏపీకి రెవెన్యూ లోటు ఉండదని ఫైనాన్స్‌ కమిషన్‌ అంచనా వేసింది. గతేడాదితో పోల్చితే  కేంద్ర పన్నులు, సుంకాల్లో ఏపీ వాటా దాదాపు రూ.4324. 69 కోట్లు పెరిగింది. 2021- 22కి ఈ వాటా రూ.26935 కోట్లు. గతేడాది పన్నుల వాటాగా రూ.22610.63  కోట్లు లభించాయి.