కేంద్ర బడ్జెట్ అన్నివర్గాలకు ఆమోదయోగ్యం

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ బ్రహ్మాండంగా ఉందని, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉన్నదని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు.బడ్జెట్‌ను జాతీయ దృక్పథంతోనే చూడాలని సూచించారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలను బడ్జెట్ సందర్భంగా ప్రస్తావించటం సహజమే అని చెబుతూ  తెలుగు రాష్ట్రాలకు ఏమిచ్చారు అనేది కాదు‌‌ .. దేశానికి ఎంత ఉపయోగం అనేది ఆలోచించాలని పేర్కొన్నారు. 
 
 రైతులకు, వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్ మంచి చేసేలా ఉందని, ఆదాయం లేకపోయినా.. ఖర్చులకు వెనుకాడకపోవటం అభినందనీయం అని తెలిపారు. ఆరోగ్య రంగానికి మెదటసారి కేంద్రం అధిక ప్రాధాన్యతనిచ్చిందని ప్రశంసించారు. ఖర్చులు చూపించ‌టం కాదు.. సమర్థ పాలనతో ఖర్చు చేసి చూపించాలని జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. 
 
 కాగా, వైద్య రంగంలో కేంద్రం కీలక సంస్కరణలకు అడుగులు వేస్తోందని సీఐఐ ప్రతినిధి లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ప్రజల ఆరోగ్యంపై అర్బన్, రూరల్ ప్రాంతాల్లో మంచి నీటి సదుపాయం కోసం ఎక్కువ కేటాయింపులు చేశారని కొనియాడారు. హెల్త్ సెంటర్స్ ఏర్పాటుకు అర్బన్, రూరల్ ప్రాంతాల్లో బడ్జెట్‌కు పెద్ద పీటవేశారని లక్ష్మీప్రసాద్ చెప్పారు.
 
ఇది ఆత్మనిర్భన్ బడ్జెట్‌గా బిజెపి నేత లంకా దినకర్ అభివర్ణించారు. పీఎం గరీబ్‌ యోజన పేదలకు ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొన్నారు. అలాగే హెల్త్‌కు సంబంధించిన పథకాలు, ప్రజలను ఆదుకోడానికి తీసుకున్న చర్యలు తదితర పథకాల ఫలితాలు స్పష్టంగా కనిపించాయని తెలిపారు. ఈ బడ్జెట్‌లో కేంద్రం ఆరోగ్యరంగానికి పెద్ద పీఠ వేసిందని వ్యాఖ్యానించారు. కరోనా వల్ల ఆదాయం తగ్గినా.. ఖర్చులను ఎక్కడా తగ్గించకుండా ఒక ప్రణాళిక ప్రకారం బడ్జెట్ రూపొందించారని లంక దినకర్ కొనియాడారు.