నామినేషన్లను ఆన్‌లైన్‌లో ఎందుకు తీసుకోలేదు?

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్‌ పత్రాలను ఆన్‌లైన్‌ ద్వారా ఎందుకు స్వీకరించలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) పంచాయతీరాజ్‌శాఖను నిలదీసింది. దీనిపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ సోమవారం ఉదయం 10 గంటలకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల పత్రాలు చించివేయడం, నామినేషన్లకు వెళ్లకుండా అభ్యర్థులను అడ్డుకోవడం తదితర సంఘటనలు జరిగినప్పుడు పలు రాజకీయ పార్టీలు ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్ల స్వీకరణ చేయాలని అభ్యర్థించాయి.  ఆ సందర్భంగా ఇక నుంచి ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించాలని పంచాయతీరాజ్‌శాఖను ఎస్‌ఈసీ ఆదేశించింది. పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ నామినేషన్లను శుక్రవారం నుంచి స్వీకరించారు. 

పలు గ్రామాల్లో అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయనివ్వకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్న వైనంపై మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో పాటు పలు రాజకీయ పార్టీలు తాము గతంలోనే ఆన్‌లైన్‌ నామినేషన్ల ప్రక్రియకు అభ్యర్థించిన వైనాన్ని ఎస్‌ఈసీకి మరోసారి గుర్తుచేశాయి. దరిమిలా ఎన్నికల సంఘం స్పందించి..

కాగా.. తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. తొలి విడత ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ ఆదివారంతో పూర్తయింది. చివరి రోజు నామినేషన్లు ఊపందుకున్నాయి.

ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 93 పంచాయతీల్లో సింగిల్‌ నామినేషన్లే పడ్డాయి. సర్పంచుల స్థానాలకు 14,158 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 56,052 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి నుండి ఏకగ్రీవాలను ప్రోత్సహించేందుకు ..వారికిచ్చే భత్యాన్ని కూడా ప్రభుత్వం పెంచినప్పటికీ..కేవలం 93 మాత్రమే సింగిల్ నామినేషన్లు వచ్చాయి.

వీటిని ఎన్నికల సంఘం పరిశీలించిన తర్వాత..వీటి సంఖ్య నిర్ధారణ కానుంది.  వీటిలో అత్యధికం వైసిపి మద్దతుదారులవే ఉన్నాయి. తొలివిడతలో విజయనగరం జిల్లాలో తప్ప, మిగిలిన 12 జిల్లాల్లో 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 173 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు పంచాయతీ సర్పంచుల స్థానాలకు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఎక్కువ నామినేషన్లు దాఖలు కాగా, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో నమోదయ్యాయి. వార్డు సభ్యుల స్థానాలకు తూ.గో జిల్లాలో అత్యధికంగా, శ్రీకాకుళంలో అత్యల్పంగా నమోదు అయ్యాయి. అదేవిధంగా సింగిల్‌ నామినేషన్లు అత్యధికగా గుంటూరు జిల్లాలో నమోదు కాగా, శ్రీకాకుళంలో ఒక్క సింగిల్‌ నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు.