బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు కొనసాగుతుంది

తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు కొనసాగుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టమైన ప్రకటన  చేశారు. బీజేపీ, అన్నాడీఎంకే మధ్య పొత్తు ఇకపైనా కొనసాగుతుందని ప్రకటించారు. ఈ విషయమై నెలకొన్న అస్పష్టతకు తన రెండు రోజుల తమిళనాడు పర్యటనలు తెరదించారు. మధురైలో జరిగిన సభలో నడ్డా ఈ కీలక ప్రకటన చేశారు. 
 
మదురైలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ గతంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో తమిళనాడు వివక్షకు గురైందని నడ్డా విమర్శించారు.  ప్రధాని నరేంద్ర మోదీ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగలిగిందని, తమిళ ప్రజలపై ఆయనకు మొదటి నుంచి ప్రేమాభిమానాలు అధికమని తెలిపారు.
 
అన్నాడీఎంకే – బీజేపీ మధ్య ఎన్నికల పొత్తు సుస్థిరమైన ఈ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఘనవిజయం సాధిస్తుందని భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే – బీజేపీల మధ్య పొత్తు పటిష్టంగా ఉందని ఆయన తెలిపారు.  బీజేపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదన మేరకు రూ. 5.42 లక్షల కోట్ల మేరకు నిధులు కేటాయించిందని గుర్తు చేశారు.  ప్రధాని మోదీ పాల్గొనే సభలలో తమిళ భాష గురించి, తమిళుల సంస్కృతి గురించి కొనియాడుతూ వస్తున్నారని చెప్పారు. 
 
కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చిన స్మార్ట్‌ సిటీ పథకం ద్వారా మదురైలో అభి వృద్ధిపనులు జరుగుతున్నాయని తెలిపారు. మదురై నగరానికి జాతిపిత మహాత్మాగాంధీకి విడదీయలేని సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. చెన్నై, తిరుచ్చి, సేలం నగరాలలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ధి పనులను అమలు చేస్తోందని నడ్డా చెప్పారు.
 
మోదీ డిఫెన్స్‌ కారిడార్‌ వంటి ప్రాజెక్టులతోపాటు అవసరమైన మేర నిధులను తమిళనాడుకు మంజూరు చేశారని నడ్డా గుర్తు చేశారు. ప్రత్యేక వాణిజ్య, ఆర్థిక, సాంస్కృతిక వారసత్వం తమిళుల సొంతమని ఆయన పేర్కొంటూ తమిళ్ ప్రపంచంలోనే పురాతన భాషలలో ఒకటని పేర్కొన్నారు.   మదురైని భక్తిభూమి అని ఆయన అభివర్ణించారు. 
 
ఇంతకు ముందు ఆయన మీనాక్షి దేవాలయాన్ని సందర్శించారు. సందర్శించుకున్న తర్వాత పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే పొత్తుపై కీలక నిర్ణయం తీసుకుంది బీజేపీ. అయితే ముఖ్యమంత్రి  అభ్యర్థి ఎవరన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.  అన్నాడీఎంకే నుంచి సీఎం అభ్యర్థా? లేదా బీజేపీ నుంచి సీఎం అభ్యర్థా? అన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఎన్నికల తర్వాత, అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ పేర్కొంటోంది. 
 
  బీజేపీ ఉన్నత కార్యాచరణ మండలి సభ్యుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తూ  అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి అందరూ కలిసికట్టుగా పాటుపడాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా జేపీ నడ్డాను రాష్ట్ర మంత్రులు ఆర్బీ ఉదయకుమార్‌, సెల్లూరు రాజు, విజయభాస్కర్‌లు కలుసుకుని అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచనల గురించి చర్చలు జరిపారు.