బీజేపీలో చేరిన ఐదుగురు కీలక టిఎంసి నేతలు 

 పశ్చిమబెంగాల్‌లో  మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  మంత్రితో పాటు నలుగురు నేతలు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ ఐదుగురు రెబల్స్‌ బిజెపిలో చేరారు.

శనివారం న్యూఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఆయన నివాసంలో కలిశారు. ముకుల్‌ రాయ్, కైలాష్‌ విజయ వర్గీయలతో కలిసి ఈ ఐదుగురు నేతలు అమిత్‌షాతో సమావేశమయ్యారు. వాస్తవానికి ఈ వారాంతంలో అమిత్‌షా పశ్చిమబెంగాల్‌లో పర్యటించాల్సి వుంది. ఆదివారం హౌరాలో జరగనున్న ర్యాలీలో పాల్గనాల్సి వుంది.

ఈ ర్యాలీలోనే ఐదుగురు నేతలు బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించాల్సి వుంది. అయితే అమిత్‌షా పర్యటన రద్దు కావడంతో వారు ఢిల్లీకి చేరుకొని ఆయనను కలిశారు. పశ్చిమబెంగాల్‌లో పార్టీ కీలక బాధ్యతలను తనకు అప్పగించాలని అమిత్‌షా భావించారని, ఈ నేపథ్యంలో  తనకు రాజధాని చేరుకునేందుకు ప్రత్యేక విమానం పంపారని  టిఎంసికి రాజీనామా చేసిన రాష్ట్ర మాజీ అటవీ శాఖ మంత్రి రాజీబ్‌ బెనర్జీ తెలిపారు. 

ఆయనతో పాటు బాలికి చెందిన టిఎంసి ఎమ్మెల్యే వైషాలి దాల్మిమా, ఉత్తరాపర ఎమ్మెల్యే ప్రబీర్‌ ఘోషల్‌, హౌరా మేయర్‌ రతిన్‌ చక్రవర్తి, మాజీ ఎమ్మెల్యే, ఐదు సార్లు పౌరచీఫ్‌గా పనిచేసిన రణఘాట్‌ పార్థ శరతి ఛటర్జీలు బిజెపి కండువా కప్పుకున్నారు. 

ఆదివారం హౌరాలో జరుగనున్న  బిజెపి ర్యాలీలో కేంద్ర టెక్స్‌టైల్‌ మంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు పార్టీ నేతలు ఈ ర్యాలీలో పాల్గననున్నారు. కాగా, అధికార టిఎంసి నుండి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బిజెపి యత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే టిఎంసిలో కీలక నేతలను తమ పార్టీలో చేరేలా వ్యూహం రచిస్తోంది. 

న్నికలకు ముందే టిఎంసినుండి వీలైనంత ఎక్కువమంది రెబల్స్‌ను తమ పార్టీలో చేర్చుకుంటామని ఇటీవల బిజెపి బహిరంగంగానే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే.. టిఎంసిలో కీలక నేత అయిన సువేందు ఇప్పటికే అధికారిని పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.