మమతాజీ బెంగాల్ ప్రజలు క్షమించరు 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీని ఆ రాష్ట్ర ప్రజలు క్షమించరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. మార్పు తెస్తానని ఇచ్చిన హామీని ఆమె మర్చిపోయారని ధ్వజమెత్తారు.

ఆదివారం హౌరాలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ మాట్లాడుతూ గత పదేళ్ళలో ఆమె నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పరిశీలిస్తే, ఆ హామీలను ఆమె మర్చిపోయినట్లు తెలుస్తుందని ధ్వజమెత్తారు. బహిరంగ సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఇతర బీజేపీ నేతలు  పాల్గొన్నారు.

అమిత్ షా మాట్లాడుతూ  తల్లి, జన్మభూమి, ప్రజలు – నినాదం తెరవెనుకకు పోయిందని ఎద్దేవా చేశారు. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ టీఎంసీ, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల నేతలు బీజేపీలో చేరుతున్నారని చెబుతూ మమత దీదీ వెనుకకు తిరిగి చూసుకుంటే ఎవరూ కనిపించరని స్పష్టం చేశారు

స్మృతి ఇరానీ బెంగాలీలో మాట్లాడుతూ అంతఃకలహాలను ప్రోత్సహించే పార్టీలో ఎవరూ మిగలరని విమరిసఞ్చారు. ‘జై శ్రీరామ్’ను అవమానించే పార్టీలో ఎవరూ కొనసాగరని స్పష్టం చేశారు. ‘జై శ్రీరామ్’ నినాదాన్ని మమత బెనర్జీ వదిలిపెట్టినప్పటికీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో రామాలయం నిర్మితమవుతోందని, రామరాజ్యం పశ్చిమ బెంగాల్ తలుపు తడుతోందని భరోసా వ్యక్తం చేశారు. 

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వరి, ధాన్యాల దొంగ అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు మమతా ప్రభుత్వం ఏ విధమైన ప్రయోజనం చేకూర్చలేదని, కేంద్రం ఇచ్చిన రాయితీలను తమవిగా ప్రచారం చేసుకున్నారని స్మృతి అన్నారు.

‘‘కరోనా లాక్‌డౌన్ సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద 80 కోట్ల మంది దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం 5 కిలోల చొప్పున బియ్యం, 1 కిలో చొప్పున పప్పు 8 నెలల పాటు ఇచ్చింది. కానీ పశ్చిమ బెంగాల్‌లో మోదీ ప్రభుత్వం పేరు తీసేసి తామే బియ్యం, పప్పు ఇచ్చినట్లు టీఎంసీ ప్రచారం చేసుకుంది. టీఎంసీ ధాన్యాల దొంగ’’ అని స్మృతి అన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ నుంచి గత డిసెంబర్‌లో బీజేపీలోకి చేరిన మాజీ మంత్రి సువేందు అధికారి వచ్చే ఫిబ్రవరి 28 నాటికి టీఎంసీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అంటూ ఎద్దేవా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఒక పార్టీగా ఇంకెంతోకాలం మనుగడ సాగించలేదని, అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనీ అన్నాతారు. ఫిబ్రవరి 28 నాటికి ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఖాళీ అయిపోతుందని, ఇంకక్కడ ఎవరూ మిగలరని స్పష్టం చేశారు.

శనివారం బీజేపీలో చేరిన మాజీ మంత్రి  రజీబ్ బెనర్జీ మాట్లాడుతూ, పశ్చిమబెంగాల్‌లో తాము డబుల్ ఇంజన్ ప్రభుత్వం కోరుకుంటున్నామని, సోనార్ బంగ్లా కోసం అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ఉండాలని తాము అశిస్తున్నామని చెప్పారు.