ఫిట్‌మెంట్‌ను 43 శాతానికి పైనే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. తగ్గించాలని చూస్తే ఊరుకునేది లేదని, తడాఖా చూపిస్తామని హెచ్చరించాయి. పీఆర్సీ రిపోర్టు చెత్తబుట్టలో వేయడానికి కూడా పనికిరాదని మండిపడ్డాయి.
ఈ రిపోర్టుతో సీఎం నిజస్వరూపం తేలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ రెండో రోజు గురువారం పీఆర్సీపై ఎనిమిది ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. మరిన్ని యూనియన్లతో శుక్ర, శనివారం కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా యూనియన్ల నేతలు మీడియాతో మాట్లాడుతూ 7.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలంటూ కమిషన్ చేసిన సిఫార్సులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సిఫార్సులను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పారు. హెచ్ఆర్ఏను పెంచాల్సింది పోయి తగ్గించాలంటూ సిఫార్సు చేయడం ఏమిటని, తగ్గిస్తే సహించబోమని హెచ్చరించారు.
రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ పెంచాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మంచి ఫిట్‌మెంట్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించాలని, ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కమిటీని కోరినట్లు వివరించారు.
More Stories
ఈడీ విచారణకు కాంగ్రెస్ నేత అజారుద్దీన్
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్