రాజాసింగ్‌కు జైలు శిక్ష… బెయిల్ 

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి స్పెషల్‌ కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్షను కోర్టు విధించింది. బీఫ్ ఫెస్టివ‌ల్ వివాదంలో గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఐదేళ్ల క్రితం బొల్లారం పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. 

ఉస్మానియా యూనివ‌ర్సిటీలో త‌ల‌పెట్టిన ఫెస్టివ‌ల్‌ను అడ్డుకునేందుకు రాజాసింగ్ య‌త్నించారు. ఈ క్ర‌మంలో పోలీసుల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని కేసు న‌మోదు చేశారు పోలీసులు. శిక్ష ఖారారు కావడంతో ఆయన వెంటనే బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. 

నెలరోజుల్లో హైకోర్టులో తేల్చుకోవాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులపై నాంపల్లి స్పెషల్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. గురువారం ఎంపీ బండి సంజయ్‌, మంత్రి మల్లారెడ్డిలపై వేర్వేరుగా నమోదైన పలు కేసుల్లో నాంపల్లి స్పెషల్‌ కోర్టు విచారణ జరిపింది.

కరీంనగర్‌లో బండి సంజయ్‌పై నమోదైన మూడు కేసులను న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనతోపాటు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదయ్యాయి. మంత్రి మల్లారెడ్డిపై నమోదైన కేసులను కొట్టివేయడానికి కోర్టు సమ్మతించలేదు.