తెలంగాణకు కేంద్రం రూ 245 కోట్లు వరద సహాయం 

తెలంగాణకు రూ. 245 కోట్ల వరద సాయాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు అదనపు సాయానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోని హై లెవల్ కమిటీ శుక్రవారం ఆమోదం తెలిపింది.

గతేడాది భారీ వర్షాల వల్ల హైదరాబాద్ ను వరద ముంచెత్తింది. ఇతర రాష్ట్రాల్లోనూ వరదలతో  తీవ్ర నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద కేంద్రం సాయాన్ని ప్రకటించింది. ఐదు రాష్ట్రాలకు కలిపి రూ. 1,751 కోట్లను విడుదల చేసింది.

తెలంగాణకు రూ.245. 96 కోట్లు, యూపీకి రూ.386. 06 కోట్లు, అస్సాంకు రూ. 437. 15 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్ కు 75.86 కోట్లు, ఒడిశాకు రూ. 320. 94 కోట్లు విడుదల చేసింది. విపత్తు సందర్బంలో పై రాష్ట్రాల నుంచి ప్రతిపాదనల కోసం వేచిచూడకుండా తక్షణమే ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్ (ఐఎంసీటీ)లను నియమించినట్టు కేంద్రం పేర్కొంది. 

2020––21లో ఇప్పటి వరకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ కింద 28 రాష్ట్రాలకు రూ.19, 036.43 కోట్లు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద 11 రాష్ట్రాలకు రూ.4, 409. 71 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది.