తెలంగాణకు కేంద్రం ప్రోత్సాహకంగా రూ 179 కోట్లు 

కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన నాలుగు సంస్కరణలకుగానూ  విజయవంతంగా మూడింటిని పూర్తి చేసిన తెలంగాణకు మూలధన వ్యయానికి అధనంగా కేంద్ర ప్రభుత్వం రూ.179 కోట్లను మంజూరు చేసింది. పౌర కేంద్రీకృత సంస్కరణల అమలులో మొదటి స్థానంలో మధ్య ప్రదేశ్ నిలువగా, రెండవ స్థానంలో తెలంగాణ నిలిచింది. 

వన్ నేషన్.. వన్ రేషన్ కార్డ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పట్టణాభివృద్ధిలో సంస్కరణలు పూర్తి చేసినందుకుగానూ తెలంగాణ రాష్ట్రానికి రూ. 179 కోట్ల ప్రోత్సాహక అదనపు నిధులను మంజూరు చేసింది. ఇందులో మొదటి వాయిదా కింద రూ.89.50 కోట్లును శనివారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

కోవిడ్-19 మహమ్మారి సవాళ్లను ఎదుర్కొనేందుకు వనరుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం మే నెల 17వ తేదీన రాష్ట్రాల రుణాలు తీసుకునే పరిమితిని రాష్ట్రాల జిఎస్‌డిపిలో 2 శాతానికి పెంచింది. ఈ ప్రత్యేక పంపిణీలో సగం రాష్ట్రాలు పౌర కేంద్రీకృత సంస్కరణలను చేపట్టడానికి అనుసంధానం చేసిన విషయం తెలిసిందే. 

ఇందులో పౌర కేంద్రీకృత రంగాలలో సంస్కరణలు (ఎ) ఒక దేశం ఒక రేషన్ కార్డ్ విధానాన్ని అమలు చేయడం, (బి) సులభతర వ్యాపార సంస్కరణ, (సి) పట్టణ స్థానిక సంస్థ, వినియోగ సంస్కరణలు (డి) విద్యుత్ రంగ సంస్కరణలను అమలు చేస్తున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనపు రుణాలు తీసుకునేందుకు ప్రొత్సహిస్తోంది.

వీటిలో ఇప్పటివరకు 10 రాష్ట్రాలు ఒక దేశం ఒక రేషన్ కార్డ్ విధానాన్ని అమలు చేశాయి. 5 రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలు చేశాయి. మరో 2 రాష్ట్రాలు స్థానిక సంస్థ సంస్కరణలను చేశాయి. 

అదనపు రుణాలు తీసుకునే అనుమతులతో పాటు, నాలుగు సంస్కరణల్లో మూడింటిని పూర్తిచేసే రాష్ట్రాలకు మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ఆర్థిక సహాయం కోసం పథకం కింద అదనపు ఆర్థిక సహాయం పొందటానికి అర్హత ఉంటుంది. ఈ పథకం కింద కేంద్రం మొత్తంగా రూ 2,000 కోట్లను కేటాయించింది. 

సేవల రంగంలోనూ తెలంగాణ  అగ్రస్థానంలో కొనసాగుతోంది. గత ఆదు సంవత్సరాలలో దేశంలోనే  సగటున 10.25శాతం మేర  రాష్ట్రం వృద్ధి నమోదు చేసింది. 2019-20లో స్థూల విలువ జోడింపులో సేవల రంగం వాటా 65.19శాతంగా నమోదు అయింది. 

సిక్కిం మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటు ఎక్కువగా ఉందని రెండు రోజుల క్రితం కేంద్రం విడుదల చేసిన ఆర్ధిక సర్వే స్పష్టం చేసింది. రాష్ట్రంలో గత ఐదేళ్లలో నికర ఉత్పత్తి 68 శాతం మేర పెరిగింది. కాగా 2019-20లో మొక్కజొన్న అత్యధికంగా పండిన రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో, కరోనా మరణాలను నిలువరించడంలో దేశంలో రెండవ స్థానంలో, కేసులను నివారించడంలో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది. 

అలాగే 2018-19 సంవత్సరానికిగానూ పత్తి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ రెండవ స్థానం, మొక్కజొన్న దిగుబడిలో మూడవ స్థానంలో నిలిచినట్లు సర్వే తెలిపింది. ఇక గ్రామాల్లో వంద శాతం ఇళ్లకు నల్లా నీరు అందించిన జిల్లాలు దేశంలో 18 ఉండగా అందులో 5 గ్రామాలు మన రాష్ట్రంలోనే ఉన్నట్లు నివేదిక పేర్కొన్నది.