బీజేపీ కార్పొరేటర్లపై కరీంనగర్ మేయర్‌ దూషణ

కరీంనగర్ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం బుధవారం రసాభాసగా మారింది. బిజెపి, టీఆర్ఎస్ కార్పొరేటర్‌లు బాహాబాహీకి దిగారు. నినాదాలు, ప్రతినినాదాలు వాగ్వివాదంతో సమావేశాన్ని గందరగోళంగా మార్చారు. 
 
మేయర్ సునీల్ రావు బీజేపీ కార్పొరేటర్‌లను యూజ్ లెస్ ఫెలో అని దూషించడం వివాదాస్పదంగా మారింది. మేయర్ అద్యక్షతన కౌన్సిల్ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రారంభం కాగానే బిజేపి కార్పొరేటర్‌లు ఎండిపోయిన హరితహారం మొక్కలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. 
 
హరిత హారం అక్రమాలకు నిలయంగా మారిందని, లక్షలు వెచ్చించి నాటిన మొక్కలను ఎందుకు రక్షించడంలేదని పోడియం వద్దకు దూసుకెళ్లి మేయర్‌ను నిలదీశారు. దీంతో మేయర్‌కు అండగా నిలుస్తూ టీఆర్ఎస్ కార్పొరేటర్‌లు పోడియం వద్దకు వచ్చి బీజేపీ కార్పొరేటర్‌లతో వాగ్వివాదానికి దిగారు. నినాదాలు, ప్రతి నినాదాలతో ఒకరినొకరు తోసుకుంటూ బాహాబాహీకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 
 
దీంతో మేయర్ సహనం కోల్పోయి బీజేపి కార్పొరేటర్ జితేందర్‌ను ఉద్దేశించి యూజ్ లెస్ ఫెలో అని దూషించడంతో బీజేపీ కార్పోరేటర్లు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. మేయర్ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. మేయర్ తీరును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.