ఉద్యోగులకు ఫిట్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా

ఉద్యోగులకు ఫిట్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా

ఉద్యోగులకు ఫిట్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా కు తెరలేపాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఫిట్‌మెంట్‌ ఇప్పుడిస్తా.. అప్పుడిస్తా అని వూరించి వూరించి మూడేండ్ల తర్వాత ఇప్పుడు బిశ్వల్ కమిటీ రిపోర్ట్ తో వుసూరు అనిపించిండు అంటూ ధ్వజమెత్తారు. 

అందరినీ మోసం చేసే.. ఉద్యోగాలు ఇస్తా అని పిలగాండ్లను, నిరుద్యోగ భృతి ఇస్త అని నిరుద్యోగులను, సన్న వడ్లు అని రైతులను.. ఇప్పుడు ఉద్యోగులను కూడా మోసం చేసిండు అని విమర్శించారు. 7.5 శాతం పది శాతం ఫిట్ మెంట్ ఇయ్యనీకే ఒక కమిటీ వేయల్నా.. మూడేండ్లు టైమ్ తీసుకోవాల్నా అంటూ ప్రశ్నించారు. 

అసలు బిశ్వల్ కమిటీ పని చేసిందా.. స్వతంత్రంగా పని చేయనిచ్చారా.. అని విస్మయం వ్యక్తం చేశారు. పీఆర్‌సీ ని ఫాం హౌజ్ ల కూసోని రాయించినవా అంటూ సీఎం కేసీఆర్ పై సంజయ్ మండిప‌డ్డారు. ఉద్యోగులను నమ్మియ్యనీకే బిశ్వల్ కమిటీ వేశారని అంటూ ఆ కమిటీ ఏం రాయాలే.. ఎంత రాయాలే.. ఒత్తిడి పెంచి ఆ రిపోర్ట్ రాయించారని ఆరోపించారు.

ఫిట్ మెంట్ 7.5 శాతం ఇచ్చి, హెచ్ ఆర్ ఎ  6 శాతం తగ్గించటం దారుణ‌మ‌ని, మోసమ‌ని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 31 నెలల నుంచి ఎదురుచూస్తున్న ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇంత దారుణమైన ఫిట్మెంట్ ను సమైక్య పాలకులు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. సమైక్య పాలకులు 25 శాతం  కంటె తక్కువ ఫిట్ మెంట్ ఎప్పుడు ఇవ్వలేదని చెప్పారు. పీఆర్సీ వేసిన వెంటనే తాత్కాలిక భృతి  ఇవ్వడం సంప్రదాయమని,  కానీ ఈ సర్కార్ అది  కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఇంటి కిరాయిలు విపరీతంగా పెరుగుతుంటే ఎచ్ ఆర్ ఎ  తగ్గించాలని అనుకోవడం మూర్ఖత్వమని మండిపడ్డారు.