త్వరలోనే భారత్ గడ్డ నుంచి మరిన్నివ్యాక్సిన్లు

త్వరలోనే భారత్ గడ్డ నుంచి మరిన్ని కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ వ్యాక్సిన్లను ఇతర దేశాలకు కూడా పంపిణీ చేస్తామని వెల్లడించారు. దావోస్‌లో జరిగిన ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రసంగించారు. ఇప్పటికే భారత్‌లో తయారు చేసిన వ్యాక్సిన్లను ప్రపంచానికి అందించామని, త్వరలోనే భారత్ గడ్డపై నుంచి మరిన్ని వ్యాక్సిన్లు వస్తాయని ఆయన తెలిపారు.

 ‘‘కోవిడ్‌కు సంబంధించి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాం. మానవ వనరులను కూడా అలాగే అభివృద్ధి చేసుకుంటున్నాం. కోవిడ్‌ను గుర్తించడానికి, కోవిడ్ పరీక్షకు అవసరమైన సాంకేతికతను కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం.’’ అని మోదీ సదస్సు  దృష్టికి తీసుకొచ్చారు.

ఇప్పటికే భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించామని, అది శరవేగంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. కేవలం 12 రోజుల్లోనే 23 లక్షల ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ను పూర్తి చేశామని మోదీ వివరించారు. ఇప్పటి వరకూ 150 దేశాలకు ఆవశ్యకమైన ఔషదాలను పంపిణీ చేశామని, అది తమ బాధ్యతగా భావిస్తామని చెప్పారు.

అలాగే కోవిడ్ వ్యాక్సిన్లను కూడా పంపిణీ చేయడానికి సిద్ధమే అని ఆయన ప్రకటించారు. కరోనా కారణంగా భారత్ ఘోరంగా దెబ్బతింటుందని, భారత్‌లో ‘కోవిడ్ సునామీ’ రాబోతోందని కొందరు హెచ్చరించారని గుర్తు చేశారు. అంతేకాకుండా డెబ్బై, ఎనబై లక్షల మందికి కోవిడ్ సోకే అవకాశం  ఉందని, 20 లక్షల మంది కోవిడ్ సోకి చనిపోతారని కూడా పేర్కొన్నారని, అయితే భారత్ మాత్రం అందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేశారు.

కరోనాపై పోరాటాన్ని తాము ప్రజల ఉద్యమంగా మార్చేశామని మోదీ తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో భారత్ విజయవంతమైన దేశంగా ఖ్యాతి గడించిందని హర్షం వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇప్పుడిప్పుడే శరవేగంగా మారిపోతున్నాయని పేర్కొంటూ  భారత్‌ అభివృద్ధిలో పాలుపంచుకోడానికి పారిశ్రామిక వేత్తలు తరలిరావాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 

కోవిడ్‌ను జయించే విషయంలో భారత్‌ను ఏ దేశంతో పోల్చడం అంత సముచితం కాదని, ప్రపంచ జనాభాలో 18 శాతం ఉన్న భారత్… మహమ్మారిని నియంత్రించి మానవాళిని కాపాడిందని పేర్కొన్నారు. కరోనా సోకిన ప్రథమార్థంలో పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవారమని, ఇప్పుడు మాత్రం భారత్ అవసరాలు తీరుస్తూనే, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసి, ప్రజలకు సేవ చేస్తున్నామని మోదీ వివరించారు.