“వేద నిలయం” ఇక జయలలిత స్మారక కేంద్రం

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె జయలలిత అధికారిక నివాసం వేద నిలయం స్మారక కేంద్రంగా రూపొంది ప్రజల సందర్శనార్థం తెరుచుకుంది. ముఖ్యమంత్రి కె పళనిసామి గురువారం స్మారక కేంద్రాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 24వ తేదీన జయలలిత జయంతిని ప్రతి ఏటా రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు.

జయలలిత అధికారిక నివాసాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని స్మారక కేంద్రంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను, భూ స్వాధీన అధికారి జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ దాఖలు చేసిన పిటిషన్లపై మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసినప్పటికీ ప్రజలకు ఇప్పటికీ అది అందుబాటులోకి రాలేదు. 

సింగల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్లడంతో ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. నిరాడంబరంగా జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పళనిసామి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వేద నిలయంను స్మారక కేంద్రంగా ప్రకటిస్తూ ఒక శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం, అసెంబ్లీ స్పీకర్ పి ధనపాల్ తదితరులు పాల్గొన్నారు. జయలలిత చిత్రపటానికి పుష్ప నివాళులర్పించిన అనంతరం జ్యోతిని వెలిగించి స్మారక కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం..మెరీనా బీచ్ ఎదురుగా ఉన్న కామరాజ విగ్రహం సమీపంలోని ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థ ఆవరణలో తొమిది అడుగుల జయలలిత విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.