తప్పుడు ట్వీట్ తో చిక్కుల్లో రాజ్‌దీప్‌ సర్దేశాయ్!

నరేంద్ర మోదీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడానికి ఎటువంటి అవకాశం దొరికినా వదులుకోకుండా ఎదురు చూస్తుంటే ప్రముఖ జర్నలిస్ట్, ఇండియా టుడే గ్రూవ్ప్ ఇండియా టుడే కన్సల్టింగ్‌ ఎడిటర్‌, న్యూస్‌ యాంకర్ రాజ్‌దీప్‌ సర్దేశాయ్ అలవాటుగా తప్పుడు ట్వీట్ ఇచ్చి చిక్కుల్లో పడ్డారు. 
ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం నాడు ట్రాక్టర్ల ర్యాలీతో దేశ రాజధాని ఢిల్లీలో హింసాయుత చర్యలకు దిగడం తెలిసిందే. ఈ క్రమంలో  ఓ సిక్కు వ్యక్తి మరణించారు. 

 రాజ్‌దీప్‌ సర్దేశాయ్ వాస్తవాలు తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా  ‘‘ పోలీసు కాల్పుల్లో 45 ఏళ్ల నవనీత్‌ మరణించాడు. అతడి త్యాగం వృథాగా పోనివ్వమని రైతులు నాకు చెప్పారు’’ అంటూ హడావుడిగా ట్వీట్‌ చేశారు. వాస్తవానికి ట్రాక్టర్‌ బోల్తాపడటంతో నవనీత్‌ మృతి చెందారు.  ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. 

బారికేడ్ల వైపు ట్రాక్టర్‌పై వేగంగా దుసుకువచ్చిన నవనీత్‌, వాహనం పల్టీ కొట్టడంతో తీవ్రగాయాల పాలయ్యారు. తల పగలడంతో ఆయన మృత్యువాత పడినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. దీంతో రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆయన ట్వీట్‌ డెలీట్‌ చేశారు. అనంతరం  ట్రాక్టర్‌ మీద ఉండగానే, పోలీసులు నవనీత్‌ను కాల్చేశారని రైతులు ఆరోపించినట్లు మరో ట్వీట్‌ చేశారు. ఢిల్లీ పోలీసులు షేర్‌ చేసిన వీడియోను పోస్ట్‌ చేసి, అందులో ట్రాక్టర్‌ బోల్తా పడినట్లు స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. 

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో పూర్తి సమాచారం తెలుసుకోకుండా ప్రజలను పక్కదోవ పట్టించేలా వ్యవహరించారంటూ ఇండియా టుడే గ్రూప్‌ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల పాటు సస్పెండ్‌ చేయడంతో పాటు నెల జీతం కోత విధించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఇండియా టుడే కన్సల్టింగ్‌ ఎడిటర్‌, న్యూస్‌ యాంకర్‌గా పనిచేస్తున్నారు.

గత వారమే రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఒక నేతాజీ ఆవిష్కరించిన నేతాజీ సుభోష్ చంద్రబోస్ చిత్రం వాస్తవానికి ఓ సినీ నటుడు ఒక సినిమాలో నటించిన చిత్రం అంటూ ట్వీట్ చేశారు. కానీ నేతాజీ కుటుంభం సభ్యులు అందించిన ఒక ఫోటో ఆధారంగా తీసిన చిత్రం అని ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ స్పష్టం చేయడంతో ఆయన తన ట్వీట్ ను ఉపసంహరించుకున్నారు. 

భారత దేశంలో జర్నలిస్ట్ లు ఈ విధంగా తప్పుడు ట్వీట్లు, కధనాలు ప్రచారంలోకి తేవడం, అవి తప్పని తెలంగానే మొక్కుబడిగా వాటిని ఉపసంహరించు కోవడం సాధారణంగా జరుగుతూనే ఉంది. అయితే ఈ కారణంపై ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఈ విధంగా మూల్యం చెల్లింపవలసి రావడం ఇదే మొదటిసారని చెప్పవచ్చు.