పార్లమెంట్ సమావేశాలు ఓ సువర్ణావకాశం 

భారత ఉజ్వలమైన భవిష్యత్‌కు ఈ దశాబ్దం ఎంతో కీలకమని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. శుక్రవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలను ఈ ఏడాదితో పాటు ఈ దశాబ్దానికి తొలి సమావేశాలు.ఈ సందర్భంగా పార్లమెంట్ సమీపంలో మీడియాతో మోదీ మాట్లాడుతూ దేశం తన కలల్ని నెరవేర్చుకునేందుకు సువార్ణావకాశం ఇదేనని తెలిపారు.

‘‘ఈ శతాబ్దానికి సంబంధించి మొదటి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. భారత ఉజ్వవ భవిష్యత్‌కు ఈ దశాబ్దం ఎంతో కీలకమైంది. స్వాతంత్ర్య సమరయోధుల కలల్ని సాకారం చేసుకునేందుకు భారత్ ముందున్న సువర్ణావకాశం మన ముందుంది’’ అని మోదీ చెప్పారు. 

ప్ర‌జ‌ల ఆశ‌యాల‌ను తీర్చేందుకు త‌మ వంతు కృషి చేస్తామ‌ని ప్ర‌ధాని మోదీ హామీ ఇచ్చారు. ఇది బ‌డ్జెట్ స‌మావేశాల స‌మ‌య‌మ‌ని, దేశ చ‌రిత్ర‌లో తొలిసారి, 2020లో ఆర్థిక మంత్రి నాలుగైదు మినీ బ‌డ్జెట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టార‌ని, విభిన్న ప్యాకేజీల రూపంలో ఆ బ‌డ్జెట్ ప్ర‌క్రియ సాగింద‌ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఇలాంటి బ‌డ్జెట్ ఉంటుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు.

కాగా రాష్ట్రపతి ప్రసంగాన్ని 18 ప్రతిపపక్ష పార్టీలు బహిష్కరించాయి. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న రైతులకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు  విపక్షాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన, తృణమూల్‌ ఆధ్వర్యంలో గురువారం సమావేశమైన ప్రతిపక్ష నేతలు ఈమేరకు దీనిపై నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీలు ప్రకటించడం పట్ల కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ప్రతిపక్షాలు ముక్కలు చేస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంటరీ వ్యవస్థలో రాష్ట్రపతికి ప్రత్యేకమైన హోదా, గౌరవం ఉన్నాయని, అలాంటిది రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం సిగ్గుచేటని గిరిరాజ్ విమర్శించారు.

‘‘పార్లమెంటరీ వ్యవస్థలో రాష్ట్రపతికి ప్రత్యేకమైన హోదా, గౌరవం ఉన్నాయి. ప్రభుత్వంపై ఏవైనా బేధాభిప్రాయాలు ఉంటే పార్లమెంట్‌లో తేల్చుకోవాలి. కానీ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం సిగ్గు చేటు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని ముక్కలు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ మేం దాన్ని కాపాడుతూనే ఉంటాం’’ అని చెప్పారు.