రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో జరిగిన హింస పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర ఆందోళన వ్యక్తం డేస్తూ దేశానికి ఎంతో పవిత్రమైన గణతంత్ర దినోత్సవానికి జాతీయ జెండాకు అవమానం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి శుక్రవారం ఆయన ప్రసంగిస్తూ ట్రాక్టర్ ర్యాలీ వేళ హింస చోటుచేసుకోవడం దురదృష్టకరమని చెప్పారు.
దేశ రైతాంగాన్ని బలోపేతం చేసేందుకు ఆత్మనిర్భర్ భారత్ ఫోకస్ చేసినట్లు చెప్పారు. కొత్త సాగు చట్టాలతో సుమారు 10 కోట్ల మంది రైతులకు లాభపడనున్నట్లు తెలిపారు. రైతు ఉత్పత్తులపై కనీస మద్దతు ధరను తమ ప్రభుత్వం పెంచినట్లు రాష్ట్రపతి వెల్లడించారు. కొత్త సాగు చట్టాలు రూపకల్పన చేయకముందు ఉన్న హక్కులు, సదుపాయాలను తగ్గించలేదని రాష్ట్రపతి స్పష్టం చేశారు.
కొత్తగా ప్రవేశపెట్టిన సాగు సంస్కరణలు.. రైతులకు కొత్త అవకాశాలను, హక్కులను కల్పించినట్లు రామ్‌నాథ్ చెప్పారు. చిన్న, మధ్యతరహా రైతుల శ్రేయస్సు కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, రైతులకు తమ అకౌంట్లలోకి నేరుగా నగదు బదిలీ చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద సుమారు 1,13000 కోట్లు బదిలీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఇక ప్రభుత్వ పథకాల గురించి రాష్ట్రపతి మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. పశువుల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పశుధన్ పథకం ప్రతి ఏడాది 8.2 శాతం వృద్ధి చెందుతోందని ఉద్ఘాటించారు. గ్రామీణులకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్నామని తెలిపారు. దేశంలో కొత్తగా 22 ఎయిమ్స్‌లకు ఆమోదం తెలిపామని దీనితో దేశ ఆరోగ్య వ్యవస్థను తమ ప్రభుత్వం మరింత బలోపేతం చేసిందని కొనియాడారు.
కరోనా సంక్షోభ సమయంలో ఉభయసభల సమావేశాలు కీలకమైనవని రామ్‌నాథ్ తెలిపారు. ఇది కొత్త సంవత్సరం అని, కొత్త దశాబ్ధం అని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల కావొస్తోందని గుర్తు చేశారు. ఎటువంటి సవాళ్లు ఎదురైనా.. భారత్ వెనకడుగు వేయదని నిరూపించినట్లు రాష్ట్రపతి తెలిపారు. అన్ని అవరోధాలను భారత్ ఎదుర్కొన్నట్లు ఆయన చెప్పారు.
కోవిడ్ సహా అనేక సమస్యల్ని దేశ ప్రజలు ఎదుర్కొన్నారని చెబుతూ టిన్నిటిపై దేశం ఐకమత్యంగా పోరాడిందని భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సంతోషం వ్యక్తం చేసారు. కరోనాపై పోరాటంలో ఎంతో మంది పౌరులను కోల్పోయామని, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా కరోనా సంక్షోభ సమయంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుపుతూ విచారం వ్యక్తం చేశారు.
కోవిడ్ వేళ ఆరు మంది ఎంపీలు మరణించినట్లు వెల్లడించారు. వారందరికీ నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు. సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయాల వల్ల మహమ్మారిని నివారించినట్లు చెప్పారు. పేద ప్రజలకు కూడా మెరుగైన ఆరోగ్య సేవలు అందుతున్నట్లు వెల్లడించారు. స్వయం సమృద్ధి చాలా అవసరం అన్న విషయాన్ని కోవిడ్ నేర్పిందని పేర్కొన్నారు. 1.5 కోట్ల మందికి ఉచిత ఆరోగ్యసేవలు అందినట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మన దేశంలో జరుగుతున్నట్లు చెప్పారు. కోవిడ్ వేళ తీసుకున్న నిర్ణయాల వల్లే మరణాల సంఖ్యను తగ్గించగలిగినట్లు రాష్ట్రపతి తెలిపారు.
6 రాష్ట్రాల్లో గ్రామీణ్ గరీభ్ కళ్యాణ్ యోజనను తమ ప్రభుత్వం అమలు చేసిందని, 14 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ఎంతో ప్రతిష్టాత్మకమని చెబుతూ పేదల కోసం వన్ నేషన్.. వన్ రేషన్ అమలు చేశామని, జన్‌ధన్ యోజన ద్వారా నేరుగా అకౌంట్లలోకి నగదు బదిలీ జరుగుతున్నట్లు వివరించారు.
More Stories
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించిన ప్రధాని మోదీ
లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన వేటు
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి