ఆరుగురు జర్నలిస్టులపై దేశద్రోహం కేసు 

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ ఎంపి శశి థరూర్‌ సహా ఆరుగురు జర్నలిస్టులపై పలు సెక్షన్ల కింద ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా 26న జరిగిన రైతుల  ట్రాక్టర్ల పరేడ్‌ సందర్భంగా తమ సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా హింసను ప్రేరేపించారనే ఆరోపణలపై గౌతమ్‌ బుద్ధ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఎంపి శశి థరూర్‌, సీనియర్‌ జర్నలిస్టులు రాజ్‌దీప్‌ సర్దేసారు, మృణాల్‌ పాండే, జాఫర్‌ ఆఘా, అనంత్‌ నాథ్‌, పరేష్‌ నాథ్‌, వినోద్‌ కె.జోస్‌లపై నోయిడాలోని సెక్టార్‌ 20 పోలీస్‌ స్టేషన్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వారిపై దేశ ద్రోహం నేరారోపణ కూడా చేశారు. 

153ఎ (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం), 153బి, 295ఎ (మతపరమైన భావాలను ప్రేరేపించే హానికరమైన చర్యలు), 298 (మతపరమైన భావాలను గాయపరిచే ఉద్దేశపూర్వక చర్యలు), 504, 506, 124ఎ, 120బి (క్రిమినల్‌ కుట్ర), ఐటి చట్టం 2000లోని సెక్షన్‌ 66 కింద కేసులు నమోదు చేశారు. 

శశి థరూర్‌తో పాటు సీనియర్‌ జర్నలిస్టులు రైతులను తప్పుదోవ పట్టించే ట్వీట్లను పోస్ట్‌ చేశారని అర్పిత్‌ మిశ్రా అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.  ‘పోలీసులు నిరసనకారుడిని కాల్చి చంపారని, నగరంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగేలా వారు ఉద్దేశపూర్వకంగా వాతావరణాన్ని సృష్టించారని, ఈ ట్వీట్ల వల్ల దేశ, ప్రజల భద్రతను ప్రమాదంలో పడేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, సోషల్‌ మీడియా సైట్లలో ఈ ట్వీట్లు చాలాసార్లు ఫార్వార్డ్‌ చేసినందున వాటిని తొలగించాలని మిశ్రా తన ఫిర్యాదులో కోరారు.