టీఎంసీతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం

పశ్చిమ బెంగాల్‌ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా శాసన సభలో తీర్మానాన్ని ఆమోదించిన నేపథ్యంలో ఆయన ఈ ఆరోపణ చేశారు.

కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా శాసన సభలో తీర్మానం చేయడాన్ని దిలీప్ ఘోష్ ఖండించారు. టీఎంసీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని ధ్వజమెత్తారు. అలాంటి పార్టీ మన ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ శాసన సభ గురువారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఈ తీర్మానాన్ని నిరసిస్తూ సభ నుంచి  వాకౌట్ చేశారు.  

ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ తీర్మానంపై శాసన సభలో మాట్లాడుతూ, వివాదాస్పద సాగు చట్టాలు రైతులకు వ్యతిరేకమైనవని, వీటిని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాలను రద్దు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం గద్దె దిగాలన్నారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఇటువంటి తీర్మానాలను పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కేరళ, పుదుచ్చేరి, ఢిల్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే.