హరిద్వార్‌ను మరో వూహన్‌గా మారనివ్వం 

కుంభమేళా నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వబోమని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ భరోసా ఇచ్చారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో హరిద్వార్‌ను మరో వూహన్‌గా మారనివ్వబోమని స్పష్టం చేశారు. కుంభమేళాలో అనుసరించవలసిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, పదేళ్ల లోపు వయసుగల బాలలను, 65 ఏళ్ళ వయసు పైబడిన వృద్ధులను కుంభమేళాలో పాల్గొనకుండా చర్యలు తీసుకుంటారు.  అదేవిధంగా గర్భిణులు, తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతించరు. ఈ విషయంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతో సమన్వయం కుదుర్చుకుంటుంది.

కోవిడ్-19 మహమ్మారితో పోరాడేందుకు వ్యక్తుల మధ్య కనీసం ఆరు అడుగుల దూరాన్ని పాటించాలని కేంద్ర ప్రభుత్వం భక్తులను కోరింది. కోవిడ్-19 నిబంధనలను పాటించని భక్తులపై భారీ జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించింది. పార్కింగ్ ప్రదేశాల్లో అధికారులు ప్రభుత్వ ధరల ప్రకారం ముఖానికి ధరించే మాస్క్‌లను అమ్ముతారు. 

హరిద్వార్ కుంభమేళా ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో రోజుకు సుమారు 10 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. విశేష ప్రాధాన్యంగల రోజుల్లో రోజుకు సుమారు 50 లక్షల మంది భక్తులు తరలి వస్తారనే అంచనా ఉంది. 

ఫిబ్రవరి 27న మాఘ పూర్ణిమ, మార్చి 11న మహాశివరాత్రి, ఏప్రిల్ 12న సోమావతి అమావాస్య, ఏప్రిల్ 14న వైశాఖి, ఏప్రిల్ 21న శ్రీరామ నవమి, ఏప్రిల్ 27న చైత్ర పూర్ణిమ పర్వదినాల్లో విశేష స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.