సింఘు సరిహద్దు‌‌లో రైతులపై గ్రామస్థుల ఆగ్రహం

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపై ఢిల్లీలోని సింఘు సరిహద్దు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ జెండాలను పట్టుకుని వచ్చిన స్థానికులు ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని రైతులను డిమాండ్ చేశారు.

గురువారం మధ్యాహ్నం స్థానికులు పెద్ద ఎత్తున హైవేపైకి వచ్చి రైతులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సింఘు సరిహద్దులను ఖాళీ చేయాలంటూ నినాదాలు చేశారు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు 2 నెలల నుంచి రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నిరసనల వల్ల తమ రోజువారీ జీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెప్పారు. ఓ వ్యక్తి మాట్లాడుతూ సింఘు సరిహద్దుల్లో రైతుల నిరసన వల్ల తన వ్యాపారం దెబ్బతిందని చెప్పారు. మరోవంక, ఘజపూర్ అధికారులు నిరసనకారులను అక్కడి  నుండి ఖాళీ చేయమని ఆదేశించారు. లేని పక్షంలో తాము ఖాళీ చేయించవలసి వస్తుందని స్పష్టం చేశారు.

మరో వ్యక్తి మాట్లాడుతూ, ఢిల్లీలో జనవరి 26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో భారత దేశ జాతీయ పతాకానికి అవమానం జరిగిందని, అందుకే తాను నిరసనలో పాల్గొనేందుకు వచ్చానని చెప్పారు. హిందూ యువ సేవా సంఘం నేత ఒకరు మాట్లాడుతూ, ప్రస్తుతం తాము మర్యాదగా చెప్తున్నామని, రైతులు వినకపోతే వాళ్లు చేసినట్లే తాము కూడా చేస్తామని స్పష్టం చేశారు. 

కాగా, రిపబ్లిక్ డే రోజున దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న విధ్వంస ఘటనల నేపథ్యంలో పలువురు రైతు సంఘాల నేతలకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే రైతు సంఘాల నేతలు రాకేశ్ టికాయిత్, యోగేంద్ర యాదవ్, దర్శన్ పాల్, గుర్నాం సింగ్ చాదుతో సహా పలువురు రైతు సంఘాల నేతలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రహోంశాఖ ఆదేశాల మేరకు రైతులపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.