రైతుల ఉద్యమం నుండి తప్పుకున్న రెండు సంఘాలు 

రైతుల ఉద్యమం నుండి తప్పుకున్న రెండు సంఘాలు 
గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో జరిగిన హింస పట్ల కలత చెందిన రెండు రైతు సంఘాలు తాము ఈ ఉద్యమం నుండి తప్పుకొంటున్నట్లు ప్రకటించాయి. అఖిల భారత కిసాన్ మజ్దూర్ సంఘటన్ , భారతీయ కిసాన్ యూనియన్ (భాను) నేతలు ఆ మేరకు  ప్రకటనలు చేశారు. 

 ముందుగా అనుకున్న దానికి భిన్నంగా నిరసనను కొనసాగించలేమని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్  నేత సర్దార్ వీఎం సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన సంఘటనల పట్ల చాలా అసంతృప్తితో ఉన్నట్లు బుధవారం ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన పేర్కొన్నారు. రైతు సంఘం నేత రాకేష్ టికాయత్‌తో విబేధించారు.

 రాకేష్‌తో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. అంతే కాకుండా ప్రస్తుతం కొనసాగుతున్న నిరసన నుంచి తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన కనీస మద్దతు ధర చట్టబద్ధత సాధించే వరకు శాంతియుతమైన నిరసన చేపడతామని ప్రకటించారు.

‘‘ప్రజలను కొట్టించడానికి చంపుకోవడానికి మేము ఇక్కడికి రాలేదు. కానీ ఈ నిరసనను కొందరు తప్పుదారి పట్టించాలని చూశారు. ముందుగా అనుకున్నదానికి భిన్నంగా నిరసనను ముందుకు సాగించలేం. రాకేష్ టికాయత్ అనే వ్యక్తితో మాకు సంబంధం లేదు. ఆయన సూచనలు మేం పరిగణలోకి తీసుకోం” అని వెల్లడించారు. 

“అందుకే ప్రస్తుతం కొనసాగుతున్న నిరసన నుంచి మేం తప్పుకుంటున్నాం. అయితే కనీస మద్ధతు ధరపై చట్టబద్ధత సాధించే వరకు శాంతియుత నిరసన కొనసాగిస్తాం’’ అని వీఎం సింగ్ తెలిపారు.