యోగేంద్ర యాదవ్, రాకేష్ తికాయత్ లపైకేసులు 

రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో చెలరేగిన హింసను ఢిల్లీ పోలీసులు,  కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణిస్తూ  బాధ్యులైన వారిపై 35 ఎఫ్ ఐ ఆర్ లను దాఖలు చేశారు. నిందితులలో యోగేంద్ర యాదవ్, రాకేష్ టికాయత్ లతో సహా 10 మంది రైతు నాయకుల పేర్లు కూడా ఉన్నాయి.
 రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు ఇవాళ 200 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరందర్నీ విచారిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
 
మరోవంక, ఈ హింసకు బాధ్యులైన వారిని గుర్తించి, తగు చర్యలు తీసుకోవడం కోసం అత్యున్నత న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్ట్ లో న్యాయవాది విశాల్ తివారి ఒక పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ముగ్గురు మాజీ న్యాయమూర్తులతో విచారణ జరపాలని కోరారు. 
 
ఎర్ర కోట వద్ద జాతీయ పతాకానికి అగౌరవం కలిగించిన వ్యక్తులు, సంస్థలపై కేసులు నమోదు చేయమని సంబంధిత ఏజెన్సీలకు ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు. 
 
ఈ ఘటనలను కేంద్ర హోంశాఖ బుధవారం సమీక్ష జరిపింది. ఎర్రకోటపై ఇతర జెండాలు ఎగురవేసిన ఘటనపై హోంశాఖ దృష్టి పెట్టింది. జెండాలు ఎగురవేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ ఆదేశించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దోషులను గుర్తించాలని పోలీస్‌శాఖకు కేంద్రం సూచించింది. ఐబీ చీఫ్‌తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు.
 
ఎర్రకోట‌ను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ ప‌టేల్ సందర్శించారు. రెడ్‌ఫోర్ట్‌లో ధ్వంసమైన భాగాలను ప్రహ్లాద్‌ పటేల్‌ పరిశీలించారు. కోట‌పై జెండాలు పాతే క్రమంలో .. రెడ్‌ఫోర్ట్‌లో కొన్ని చోట్ల గోడలు ధ్వంస‌మైనట్టు గుర్తించారు. టికెట్ కౌంటర్లు, బ్యాగేజ్ స్కానర్లు, సెక్యూరిటీ పోస్ట్లు, గాజు తలుపులు, భద్రతా కెమెరాలు, పరిపాలన కార్యాలయం వంటివి ధ్వంసమయ్యాయి.