జైలు నుంచి విడుదలైన శ‌శిక‌ళ దారి ఎటు?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి, అన్నాడీఎంకే బ‌హిష్కృత నేత శ‌శిక‌ళ జైలు నుంచి విడుద‌ల అయ్యారు. అవినీతి కేసులో శ‌శిక‌ళ నాలుగేళ్ల జైలు శిక్ష అనుభ‌వించింది. ఈ శిక్ష నేటితో పూర్తి అయింది. అయితే కొద్దిరోజుల క్రితం.. క‌రోనా బారిన‌ప‌డ్డ శ‌శిక‌ళ బెంగ‌ళూరు విక్టోరియా ఆస్ప‌త్రిలో చేరిన విష‌యం తెలిసిందే.

జ‌న‌వ‌రి 20వ తేదీ నుంచి ఆమె క‌రోనా చికిత్స పొందుతున్నారు. ఈ క్ర‌మంలో ఆమె విడుద‌ల‌కు సంబంధించిన ప్ర‌క్రియను ఆస్ప‌త్రిలోనే అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే శశికళ జైలు నుంచి విడుదలయ్యేందుకు ఆమె రూ.10కోట్ల జరిమానా చెల్లించారు. వైద్యుల‌తో చ‌ర్చించి డిశ్చార్జిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని బంధువులు తెలిపారు. ప్ర‌స్తుతం శ‌శిక‌ళ ఆరోగ్యం మెరుగ్గానే ఉంద‌ని ఆస్ప‌త్రి వైద్యులు స్ప‌ష్టం చేశారు. మ‌రో 10 రోజుల పాటు ఆస్ప‌త్రిలోనే ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వైద్యులు పేర్కొన్నారు.

త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఆమె రాజకీయ ఎత్తుగడల గురించి పలు ఊహాగానాలు జరుగుతున్నాయి. ఆమె ముందు నాలుగు మార్గాలు ఉన్నట్లు ఈ సందర్భంగా పరిశీలకులు భావిస్తున్నారు. తిరిగి అన్నాడీఎంకేలో చేరి, క్రియాశీల పాత్ర వహించడం  ఒకటైతే,రాజకీయాల నుండి  వైదొలగడం మరొకటి. 

జైలుకు వెళ్లేముందు ముఖ్యమంత్రి పీఠం నుండి ఆమె పన్నీరుసెల్వంను దించివేసి, పళనిస్వామిని ఆమె ముఖ్యమంత్రిగా చేశారు. అయితే ఆ తర్వాత వారిద్దరూ ఒక్కటయ్యారు. ఆమెను తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి పన్నీరుసెల్వం ఇష్టపడటం లేదు. ఆమె  వస్తే, ముఖ్యంగా పార్టీ ఎన్నికలలో ఓటమి చెందితే పార్టీ పెత్తనం మొత్తం ఆమె హస్తగతం చేసుకొని, తనను  మరోసారి అణచివేస్తారని ఆయన భయపడుతున్నారు. 

ఆ విధంగా కాకుండా ఆమె మేనల్లుడు దినకరన్ నెలకొల్పిన ఎఎంఎంకె నాయకత్వం చేపట్టి,  అన్నాడీఎంకేతో పొత్తు ఏర్పరచుకోవడం ఆమెముందున్న మరొక మార్గంగా కనిపిస్తున్నది. అందుకు అన్నాడీఎంకేలో పలువురు నేతలు సహితం సుముఖంగా ఉన్నారు. ఒంటరిగా పోటీచేస్తే డీఎంకే అధికారంలోకి రావచ్చని వారంతా భయపడుతున్నారు. 

ఇవేమి కాకుండా డీఎంకే, అన్నాడీఎంకేలకు వ్యతిరేకంగా ఎఎంఎంకే మరో కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నం చేసే అవకాశాలు కూడా లేకపోలేదని భావిస్తున్నారు. ఆమెతో కలసి కూటమి ఏర్పాటుకు ఎస్ రామదాస్ నాయకతంలోని పీఎంకే, కెప్టెన్ విజయకాంత్ నాయకత్వం లోని డిఎండికె సిద్ధం కావచ్చని భావిస్తున్నారు. 

కాగా,  శశికళకు ఈ-జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కల్పించాలని తమె తరఫు న్యాయవాఇ రాజరాజన్‌ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. చెన్నైలోని సోదరుడి కుమార్తె కృష్ణప్రియ ఇంట్లో ఉండబోతున్న ఆమె భద్రతకు సెక్యూరిటీ కల్పించాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.