
గణతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగ పీఠికను చదవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్‌లోని అహ్మదాబాద్ వచ్చిన ఆయన మంగళవారం నగరంలోని రాష్ట్ర ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్లాలనే ఆలోచనా, దృక్పథం దేశ ప్రజలైన మనలో ఉండాలని హితవు చెప్పారు. ‘‘దేశ ప్రజలందరూ తప్పనిసరిగా భారత రాజ్యాంగ పీఠిక చదవాలి. ఆ పీఠికే దేశాన్ని ఎటువైపు తీసుకెళ్లాలనే విషయాన్ని మనకు బోధిస్తుంది. ఈ దేశ పౌరులుగా అది మన బాధ్యత’’ అని మోహన్ భాగవత్ చెప్పారు.
ఇక దీనితో పాటు జాతీయ గీతం ‘జన గణ మన’ను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలోని భిన్న ప్రాంతాల సంస్కృతినీ ఐక్యతను జాతీయ గీతంలో ప్రతిబింబిస్తుందని తెలిపారు. జెండావందన వేడుకలో భారత చిత్రపటాన్ని గీసి జన గణ మన చదివుతుండే దేశంలోని వివిధ ప్రాంతాల సరిహద్దులు కళ్లకు తడతాయని మోహన్ భాగవత్ పేర్కొన్నారు.
ఇక జాతీయ జెండాలోని మూడు రంగుల ప్రాముఖ్యతను మోహన్ భాగవత్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ఎరుపు ధైర్యానికి, శక్తికి చిహ్నమని, త్యాగానికి, కష్టానికి ఇది సంకేతమని తెలిపారు. తెలుపు మచ్చలేని మనస్తత్వానికి గుర్తని, ఎలాంటి బేషజాలం లేకుండా దేశానికి సేవ చేయమని తెలుపు చెబుతోందని తెలిపారు.
ఇక ఆకుపచ్చ లక్ష్మీ దేవికి మరో రూపమని అంటూ ఇది దేశం సంపన్నంగా ఉండాలని, ఎవరినీ ఆకలికి గురి చేయడకూడదని తెలుపుతుందని పేర్కొన్నారు. ఈ మూడు రంగులతో దేశం ముందుకు పోతోందని మోహన్ భాగవత్ చెప్పుకొచ్చారు.
More Stories
సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ దోషి
అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత
ముగ్గురు సీనియర్ నేతలకు బిజెపి షోకాజ్ నోటీసులు