లక్ష కోట్లతో జాతీయ బ్యాంకు, ‘పీఎం కిసాన్‌’ కు రూ.10 వేలు!

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ లో దేశ ఆర్ధిక వ్యవస్థను పటిష్టపరిచే దిశలో పలు విశేష అంశాలను ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు సంకేతం ఇస్తున్నాయి. వాటిల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ 1 లక్ష కోట్లతో జాతీయ బ్యాంకు ఏర్పాటు, రైతులకు ప్రతి ఏడు ఇస్తున్న రూ 6 వేలును రూ 10 వేలుకు పెంచడం, ప్రజారోగ్యానికి అదనపు నిధులు, దేశీయ తయారీ,  ఎగుమతులను ప్రోత్సహించేందుకు పలు ప్రతిపాదనలు ఉన్నట్లు చెబుతున్నారు. 
 
మౌలిక వసతులకు సంబంధించిన భారీ ప్రాజెక్టులకు సులభంగా పెట్టుబడులు అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ బ్యాంక్‌ను ఓ ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది. ప్రత్యేక చట్టం ద్వారా ప్రభుత్వం ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు చెబుతున్నారు. దీనికి తొలుత రూ.20 వేల కోట్ల పెయిడప్‌ క్యాపిటల్‌ను సమకూర్చవచ్చని తెలుస్తున్నది. ప్రావిడెంట్‌, పెన్షన్‌, ఇన్సూరెన్స్‌ ఫండ్‌ సంస్థలు తమ నిధుల్లో కొన్నింటిని తప్పనిసరిగా నేషనల్‌ బ్యాంక్‌లో ఉంచేలా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రూ.6 వేల ఆర్థికసాయాన్ని రూ.10 వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న 2021 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. రూ.6 వేల సాయంతో పెద్దగా చేకూరుతున్న ప్రయోజనమేమీ లేదన్న అభిప్రాయాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దానితో పీఎం-కిసాన్‌ సాయాన్ని రూ.10 వేలకు పెంచడం ద్వారా కొంత ఉపశమనం కల్పించే అభిప్రాయంలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. 

కాగా, కరోనా నేర్పిన పాఠంతో ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వ దృక్పథంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. దేశంలో వైద్య సౌకర్యాలు, ఆరోగ్య సేవల కోసం ఇకపై అధిక నిధులు కేటాయించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రంగానికి జీడీపీలో ఒక శాతానికి పైగా మాత్రమే ఖర్చు చేస్తుండగా, 2025 నాటికి దీనిని 2.5 శాతానికి పెంచడం లక్ష్యంగా పెట్టుకోనుంది. ఈ మేరకు రానున్న కేంద్ర బడ్జెట్‌లో సరికొత్త నిధిని ఏర్పాటు చేయనుంది. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీనిని సమకూర్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం పౌరులు చెల్లించే వ్యక్తిగత ఆదాయపు పన్నుపై, కంపెనీలు చెల్లించే కార్పొరేట్‌ ట్యాక్స్‌పై నాలుగు శాతాన్ని హెల్త్‌, ఎడ్యుకేషన్‌ సెస్‌గా వసూలు చేయాలని యోచిస్తోంది. 

దేశీయ తయారీ, ఎగుమతుల రంగాలను ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పలు నిర్దిష్ఠ చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తున్నది. దీనిలో భాగంగా ఫర్నిచర్‌ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, రాగి తుక్కు, కొన్ని రకాల రసాయనాలు, టెలికం పరికరాలు, రబ్బర్‌ ఉత్పత్తులపై కస్టమ్స్‌ సుంకాలను కుదించే అవకాశం కనిపిస్తున్నది. 

సానబెట్టిన వజ్రాలు, రబ్బర్‌ వస్తువులు, లెదర్‌ దుస్తులు, టెలికం పరికరాలు, తివాచీల్లాంటి దాదాపు 20 రకాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించవచ్చని, ఫర్నిచర్‌ తయారీకి ఉపయోగించే రఫ్‌ కలప, స్వాన్‌ ఉడ్‌, హార్డ్‌ బోర్డ్‌ లాంటి కొన్ని రకాల ముడి పదార్థాలపై కస్టమ్స్‌ సుంకాలను తొలగించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. 

ఇదే సమయంలో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, క్లాత్‌ డ్రయర్ల లాంటి కొన్ని రకాల ఫినిష్ట్‌ వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచవచ్చని ఓ అధికారి తెలిపారు. దేశీయ తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఎయిర్‌ కండీషనర్లు, ఎల్‌ఈడీ లైట్ల తయారీ లాంటి పలు పరిశ్రమల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

పర్యావరణాన్ని కాపాడేందుకుగాను కాలం చెల్లిన వాహనాలకు ఇకపై గ్రీన్‌ ట్యాక్స్‌ విధించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆమోదం తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రకారం ఎనిమిదేళ్లు దాటిన రవాణా వాహనాలు, 15 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలకు రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ సందర్భంలో గ్రీన్‌ ట్యాక్స్‌ను విధించనున్నారు.