బొగ్గు కుంభకోణంలో ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్‌ అరెస్ట్

బొగ్గు కుంభకోణంలో ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్‌ అరెస్ట్
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఒక బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా, రాజకీయ సలహా సంస్థ ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ వినేష్ చందేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనను న్యాయమూర్తి 10 రోజుల ఈడీ కస్టడీకి అనుమతించారు. 
 
ఐ-ప్యాక్ సంస్థ 2021 నుండి టీఎంసీకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి రాజకీయ సలహాలు అందిస్తోంది. ఇంతకుముందు ఏప్రిల్ 2న, ఈడీ అధికారులు ఢిల్లీలోని చందేల్ నివాసంతో పాటు, బెంగళూరులోని ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు రిషి రాజ్ సింగ్, ముంబైలోని ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ విజయ్ నాయర్ నివాసాలతో సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. 
 
జనవరి 8న, ఈ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఐ-ప్యాక్ కార్యాలయంలో, దాని వ్యవస్థాపకుడు, డైరెక్టర్లలో ఒకరైన ప్రతీక్ జైన్ కోల్‌కతా నివాసంలో సోదాలు నిర్వహించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ఆ ప్రదేశానికి చేరుకోవడంతో ఈ ఘటన వివాదానికి దారితీసింది.  
పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ కొనసాగిస్తున్న ఎన్నికల ప్రచారాలను అడ్డుకోవడానికి బీజేపీ చేస్తున్న ‘నిస్సహాయ ప్రయత్నం’గా ఈడీ చర్యను కోల్‌కతాలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభివర్ణించింది. చాండెల్ అరెస్టు ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతత్వంపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోందని టిఎంసి జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తెలిపారు. 
పశ్చిమ బెంగాల్‌లోని ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ గనులకు సంబంధించి బహుళ కోట్ల రూపాయల బొగ్గు అక్రమ రవాణా కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ సీబీఐ నవంబర్ 2020లో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ ఈడీ కేసు ప్రారంభమైంది.  ఈడీ ప్రకారం, ఆరోపిత బొగ్గు స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఒక ‘హవాలా’ ఆపరేటర్, ఐ-ప్యాక్ రిజిస్టర్డ్ సంస్థ అయిన ఇండియన్ ప్యాక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు పదుల కోట్ల రూపాయల విలువైన లావాదేవీలను సులభతరం చేశాడు.
ఈ హవాలా నిధులతో సంబంధం ఉన్న సంస్థలలో ఐ-ప్యాక్ కూడా ఉందని ఏజెన్సీ ఆరోపించింది.  పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఆరోపిత బొగ్గు అక్రమ రవాణా ద్వారా వచ్చిన దాదాపు రూ. 20 కోట్లను ఐ-ప్యాక్‌కు మళ్లించారని ఈడీ గతంలో పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఢిల్లీ మద్యం కేసుపై ఏజెన్సీ జరిపిన దర్యాప్తు సమయంలో పరిశీలన పరిధిలోకి వచ్చిన, ముంబై కేంద్రంగా పనిచేసే ఒక “అంగడియా” సంస్థ ద్వారా ఈ నిధులు తరలించిన్నట్లు అధికారులు తెలిపారు.