దేశంలో థర్డ్‌పార్టీ బీమా లేకుండా తిరుగుతున్న వాహనాల సంఖ్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు చెల్లుబాటు అయ్యే థర్డ్‌పార్టీ బీమా లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వకుండా పైలట్ ప్రాజెక్టును రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కొత్త కార్లకు నాలుగేళ్లు, కొత్త ద్విచక్ర వాహనాలకు ఆరేళ్లపాటు థర్డ్‌పార్టీ బీమా తప్పనిసరిగా కొనుగోలు చేయాలని బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ)కి జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ధర్మాసనం దిశానిర్దేశం చేసింది.
దేశంలోని రహదారులపై తిరుగుతున్న వాటిలో సగానికిపైగా వాహనాలకు బీమా లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని అభిప్రాయపడింది. దేశంలోని 30.48 కోట్ల రిజిస్టర్డ్ వాహనాలు ఉంటే 16.54 కోట్ల వాహనాలకు ఎలాంటి బీమా లేదని గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా ఏటా 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రస్తావించింది.
కనీస బీమా లేకపోవడం వల్ల ప్రమాద బాధితులకు, వారి కుటుంబాలకు నష్టపరిహారం అందడంలో దశాబ్దాల తరబడి జాప్యం జరుగుతోందని కోర్టు గుర్తు చేసింది. బీమా లేకుండా వాహనం నడుపుతూ తొలిసారి దొరికితే వార్షిక బీమా ప్రీమియంకు మూడు రెట్లు లేదా రూ.5,000(రెండింటిలో ఏది ఎక్కువైతే అది) జరిమానాగా వసూలు చేయాలి. రెండోసారి పట్టుబడితే ప్రీమియంకు ఐదు రెట్లు లేదా రూ.10,000 ఫైన్ వేయాలని ప్రతిపాదించింది.
ఈ కేసులో మృతుడి కుటుంబానికి 7.5 శాతం వడ్డీతో సహా రూ.10,00,500 పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) కలిసి పైలట్ ప్రాజెక్టును రూపొందించాలని కోర్టు సూచించింది. సుప్రీంకోర్టు చేసిన సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటే మోటారు వాహన రంగంలో భారీ మార్పులు రానున్నాయి.
జాతీయ రహదారులు, నగరాల్లోని ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్‌పీఆర్) కెమెరాలను కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ డేటాబేస్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలతో అనుసంధానించాలని కోర్టు ఆదేశించింది. టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఏఎన్‌పీఆర్ టెక్నాలజీతో కూడిన టోలింగ్ విధానాలను మరింత విస్తరించాలని సూచించింది.
ఈ కెమెరాలను వాహన్ పోర్టల్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాతో అనుసంధానం చేసి బీమా లేని వాహనాలకు ఆటోమేటిక్‌గా ఈ-చలాన్లు జారీ చేసే విధానాన్ని కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఆదేశించింది. అదేవిధంగా రాష్ట్ర పోలీసులకు హ్యాండ్‌హెల్డ్ పరికరాలు లేదా మొబైల్ యాప్‌లను అందించి, వాహన బీమా స్థితిని తక్షణమే తనిఖీ చేసే అవకాశం కల్పించాలని సూచించింది.

More Stories
రోజుకు 12 సార్లు ఈ20 పెట్రోల్ నాణ్యత పరీక్షలు
అయోధ్య నిధుల కేసులో సాధువులకు సంబంధం లేదు
సిద్ధి వినాయక ఆలయం నుండి ఆర్ధిక నివేదిక కోరిన ప్రభుత్వం