బిజెపి ఎంపీ నిషికాంత్ దూబే నేతృత్వంలోని ఈ కమిటీ ప్రధాని వీడియో తొలగింపును ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్యగా అభివర్ణించింది. దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని వీడియోను తొలగించడం తీవ్రమైన విషయంగా పేర్కొన్నది. మూడు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే ఫేస్‌బుక్‌కు ప్రస్తుతం ఉన్న ‘సేఫ్ హార్బర్’ రక్షణను తొలగించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని కమిటీ హెచ్చరించినట్టు సమాచారం.
అలా జరిగితే సోషల్ మీడియా సంస్థ అధికారులపై నేరుగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసే అవకాశం ఉంటుందని తెలిపింది. కాగా, జూలై 23న ప్రధాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సెల్ఫీ వీడియోను పోస్టు చేశారు. తర్వాత అదే వీడియోను ఫేస్‌బుక్‌లో కూడా షేర్ చేశారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రశ్నాపత్రాల లీకేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని దాంట్లో హామీ ఇచ్చారు. అయితే ఫేస్‌బుక్‌లో ఆ వీడియో కొద్దిసేపు కనిపించకుండా పోవడంతో వివాదం చెలరేగింది.
విమర్శలు రావడంతో మెటా వెంటనే ఆ పోస్టును పునరుద్ధరించింది. ఇటీవల పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరైన మెటా ప్రతినిధులు, ఇది సాంకేతిక లోపంవల్ల జరిగిందని క్షమాపణ చెప్పారు. అయితే ఐటీ శాఖ ఆ వివరణను పూర్తిగా అంగీకరించలేదు. నిజంగా సాంకేతిక లోపమే అయితే అలాంటి సమస్యలు మళ్లీ రాకుండా మెటా తన వ్యవస్థలను మెరుగుపరచాలని సూచించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన అసభ్యకర కంటెంట్ ప్రకటనల రూపంలో కనిపిస్తున్న వ్యవహారంపైనా మెటాపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నోటీసు ఇచ్చింది. ఈ అంశంపై పార్లమెంటరీ కమిటీ మరోసారి హెచ్చరిక జారీచేసింది. గూగుల్, యూట్యూబ్, ఎక్స్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ సహా అన్ని సోషల్ మీడియా వేదికలు చిన్నారులపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్‌ను కట్టడి చేసే నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కమిటీ స్పష్టంచేసింది. ఉల్లంఘనలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

More Stories
బీమా లేకుండా తిరుగుతున్న వాహనాలకు పెట్రోల్ లేదు
రోజుకు 12 సార్లు ఈ20 పెట్రోల్ నాణ్యత పరీక్షలు
అయోధ్య నిధుల కేసులో సాధువులకు సంబంధం లేదు