తీవ్రవాదులు హైజాక్ చేసిన రైతుల ఉద్యమం!

తీవ్రవాదులు హైజాక్ చేసిన రైతుల ఉద్యమం!

అంతర్జాతీయంగా భారత దేశ ప్రతిష్టలను మంటగరిపే విధంగా గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ అదుపు తప్పి, హింసాకాండకు దారితీయడం గమనిస్తే రెండు నెలలుగా ప్రశాంతంగా కొనసాగుతున్న ఉద్యమాన్ని తీవ్రవాదులు హైజాక్ చేసిన్నట్లు స్పష్టం అవుతున్నది. ఈ ఉద్యమంలో చొరబడి హింసను రేకేకేతించడం కోసం ఒక వంక ఖలిస్థాన్ వాదులు, మరో వంక పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ కుట్రపు పన్నుతున్నట్లు వస్తున్న కధనాలు యదార్ధమని వెల్లడైనది.

ఆదివారం పోలీసుల వద్ద రిపబ్లిక్ పెరేడ్ పూర్తయిన తర్వాత మాత్రమే, ఆ ప్రాంతం వైపుకు వెళ్లకుండా, శాంతియుతంగా ట్రాక్టర్ ర్యాలీ జరుపుతామని హామీ ఇచ్చిన రైతు నాయకులు ఎవ్వరు నిన్న హింస జరుగుతుంటే ఎక్కడా కనిపించలేదు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ప్రారంభం కావలసిన ర్యాలీ ఉదయం 8 గంటల నుండే ప్రారంభం కావడానికి కారకులు ఎవ్వరో చెప్పడం లేదు.

తమ ర్యాలిలోకి “బయటి శక్తులు” జొరబడి హింసను సృష్టించారని, జరిగిన సంఘటనలతో తమకు సంబంధం లేదని సాయంత్రం సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన విడుదల చేసింది. సంఘవిద్రోహ శక్తులు తమ ర్యాలీలోకి చొరబడ్డాయని ఆరోపించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా తాము అన్ని ప్రయత్నాలు చేసిప్పటికీ కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు రూట్‌మ్యాప్‌ను ఉల్లంఘించి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపింది. అంటే ఉద్యమం తమ అదుపు తప్పిన్నట్లు వారు అంగీకరిస్తున్నారు. అందుకు ఎవ్వరు బాధ్యత వహించాలి?

వాస్తవానికి గత ఆదివారమే ట్రాక్టర్ ర్యాలిలోకి జొరబడి హింసను ప్రేరేపించే  కుట్ర జరుగుతున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. జనవరి 13 నుండి 18 వరకు పాకిస్తాన్ లో సుమారు 300 ట్విట్టర్ హేండిల్ లను సృష్టించి, ర్యాలీలో జొరబడి అరాచకం ప్రోత్సహిస్తున్నట్లు కనుగొన్నామని ఢిల్లీ ప్రత్యేక పోలీస్ కమీషనర్ (నిఘా) దీపక్ పథక్ వెల్లడించారు. వీరిని ఐఎస్ఐ నడిపిస్తున్నట్లు కూడా తెలిపారు.

అంతకు ముందు నిషేధిత ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటపై ఖలిస్థాన్ జెండాను ఎగరవేసిన వానికి 2.50 లక్షల అమెరికా డాలర్ల బహుమతిని ప్రకటించింది. ఈ విధమైన కుట్రలు ఒకొక్కటి వెలుగులోకి వస్తున్నప్పుడు రైతు నాయకులు ఎవ్వరు స్పందించక పోవడం గమనార్హం. ఈ సందర్భంగా వైరల్ గా మారిన మరో వీడియో కూడా ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. రైతుల ఉద్యమం  భారత  దేశ  రాజకీయాలపైననే కాకుండా దక్షిణ ఆసియా రాజకీయాలపై విశేష ప్రభావం చూపుతుందని అంటూ ఒక ఖాళీస్థాని మద్దతుదారుడు పేర్కొనడం గమనార్హం. పైగా రైతుల ఉద్యమాన్ని `విప్లవం’గా అభివర్ణించాడు.

ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం ఉన్న ఐటిఓ ప్రాంతానికి చేరుకొని, పోలీసులపైననే దాడులు  జరపడం, కర్రలతో వారిని కొట్టడం చూస్తుంటే అంతా ఒక పధకం ప్రకారమే హింసకు పాల్పడినట్లు వెల్లడి అవుతున్నది. ట్రాక్టర్ ర్యాలీలో కత్తులు వంటి సాంప్రదాయ ఆయుధాలు ఎవ్వరు చేపట్టరాదని రైతు నాయకులు అంగీకరించారు. పైగా ఒకొక్క ట్రాక్టర్ పై ఐదుగురుకు మించి ఉండరని కూడా ఒప్పుకున్నారు.

అయితే 11 విడతలుగా కేంద్ర మంత్రులతో సంప్రదింపులతో పాల్గొంటున్న రైతు నాయకులు ఎవ్వరు ఢిల్లీ వీధులలో కనిపించలేదు. యధేచ్చగా కత్తులు ధరిస్తూ, వీలయినంతమంది ఎక్కువగా ట్రాక్టర్ లపై విన్యాసాలు చేస్తూ అనూహ్యమైన విధ్వంసంపై పాల్పడ్డారు. 

రైతు ఉద్యమం మొదట్లో రిలయన్స్ ఐటి టవర్లను ధ్వంసం చేయడం ద్వారా ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిన్నట్లే, ఇప్పుడు కూడా చేశారు. కేవలం పోలీసులను, భద్రతా దళాలను రెచ్చగొట్టి దేశ రాజధానిలో అనూహ్యమైన శాంతి, భద్రతల సమస్యలు తీసుకు రావాలని ప్రయత్నం చేశారు. 

అయితే తీవ్రవాదుల ఎత్తుగడలు విఫలం అయ్యాయి. ఢిల్లీ పోలీసులు ఎంత నిబద్దతతో,  సహనం కోల్పోకుండా, కాల్పులకు దిగకుండా, బాష్పవాయువు వరకు పరిమితమై ఎంతో సహనంతో వ్యవహరించారు. అందుకనే పెద్ద ఎత్తున జననష్టం జరుగకుండా నివారించారు. 

పోలీసులపై ఒక పధకం ప్రకారం దాడులు జరిపినా వారు రెచ్చిపోలేదు.  కృపాణాలు ధరించిన నిహాంగ్‌ సిక్కులు పోలీసులతో యుద్ధానికి దిగారు. లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగాలతో ఆ ప్రదేశం రణరంగాన్ని తలపించింది. ఓ దశలో అదనపు డిసిపి మంజీత్ పై  ఓ యువరైతు ట్రాక్టర్‌ను నడపడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. ఐటీవో వద్దే ట్రాక్టర్‌ తిరగబడి నవనీత్‌సింగ్‌ అనే రైతు చనిపోయాడు. 

ప్రశాంతంగా ర్యాలీ తీస్తామని హామీ ఇచ్చిన రైతు సంఘాలు ఒప్పందాన్ని, షరతులను ఉల్లంఘించాయని, రైతులు అరాచకానికి పాల్పడ్డారని ఢిల్లీ పోలీసులు  విమర్శించారు. 120 మంది పోలీసులు గాయపడ్డారని తెలిపారు. అరాచక మూకలపై చట్ట ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేసిన పోలీసులు, నాలుగు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఐటీవో జోన్‌ వద్దకు చేరుకున్న ఆందోళనకారులు, ఒక్క సారిగా తమ ట్రాక్టర్లను ఎర్రకోట వైపు దిశ మార్చారు. ఈ పరిణామాన్ని ఊహించని పారామిలటరీ దళాలు కూడా అటువైపు వెళ్లాయి. వారిని నియంత్రించేలోపే 20కిపైగా ట్రాక్టర్లు ఎర్రకోట ప్రాంగణంలోకి ప్రవేశించాయి. వందలమంది రైతులు నడుచుకుంటూ, కరవాలాలు, కర్రలు తిప్పుతూ లోపలికి వెళ్లారు.

త్రివర్ణ పతాకాలతోపాటు తమ యూనియన్ల జెం డాలు, సిక్కుమత జెండాలు చేత బూని బురుజుల మీదకు ఎక్కడానికి ప్రయత్నించారు. అనేకమంది చుట్టుముట్టి రక్షణగా నిలవగా ఓ వ్యక్తి- సాధారణంగా ప్రధానులు స్వాతంత్య్ర దినోత్సవం రోజున మువ్వన్నెల జెండా ఎగరేసే స్తంభంపైకి ఎక్కి సిక్కు మత జెండాను  ఎగరేసి దేశ ప్రతిష్టను మంటగరిపారు. 

 బురుజుల మీద కూడా ఈ జెండాలను ఎగరేయడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. ‘అందరూ ఎర్రకోట వైపు రండి’ అంటూ కొం దరు తమ సహచరులను చిన్న చిన్న మైక్‌ల ద్వారా పిలవడం వినిపించింది. 90 నిమిషాలపాటు ఎర్రకోట ప్రాంగణం ఉద్రిక్తతతో అట్టుడికింది. ప్రతి ఏడూ స్వతంత్ర దినోత్సవం రోజున దేశ ప్రధాని జాతీయ పథకాన్ని ఆవిష్కరించే ఎర్ర కోటాపై కేసరి పథకాన్ని ఎగురవేయడం కేవలం దేశ ప్రతిష్టను మంటగరిపే కుట్రలో భాగమే అని పరిగణించాలి.

“ఎర్రకోట మన ప్రజాస్వామ్యం ప్రతిష్టకు సూచిక. ఆందోళనకారులు దానికి దూరంగా ఉంది వలసింది. దాని ప్రతిష్టను మంటగరపడాన్ని నేను ఖండిస్తున్నాను. ఇది చాల విచారకరం. దురదృష్టకరం” అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ విచారం వ్యక్తం చేశారు. 

రైతుల ఉద్యమానికి బేషరతు మద్దతు అందజేస్తున్న మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సహితం మంగళవారం నాటి సంఘటనల పట్ల దిగ్ర్భ్రాంతి వ్యక్తం చేశారు. “రిపబ్లిక్ దినోత్సవంనాడు పవిత్రమైన మూడు రంగుల జెండా తప్ప మరే జెండా ఎగరడానికి వీలు లేదు. రైతుల ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వీరి విద్రోహకర చర్యలను ఖండించకుండా ఉండలేను” అని స్పష్టం చేశారు. 

కిసాన్‌ పరేడ్‌లో జరిగిన హింసా విధ్వంసాలకు తాను సిగ్గుపడుతున్నానని, ఇందుకు తాను వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తున్నానని స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌ అన్నారు. ‘ఎవరు చేశారు, ఎందుకు చేశారన్నది చెప్పలేను. కానీ, హింసతో మేం విజయం సాధించలేమని మొదట్నుంచీ నమ్మాం. ఈ ఆందోళనకు దూరం పెట్టిన వారే దీనికి పాల్పడినట్లు కనిపిస్తోంది’’  అని తెలిపారు.