ఢిల్లీలో హింసాత్మకంగా మారిన రైతుల ఆందోళన 

ఇప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతూ వస్తున్న రైతుల ఆందోళన అకస్మాత్తుగా రిపబ్లిక్ దినోత్సవం నాడు హింసాత్మకంగా మారింది. ప్రభుత్వం వద్దని వారిస్తున్నా ఈ రోజు రైతులు జరిపిన ట్రాక్టర్ ర్యాలీ దేశ రాజధానిలో పలు హింసాత్మక సంఘటనలకు దారితీసింది. అడ్డువచ్చిన పోలీసులపైనే తిరగబడి హింసకు దిగారు.

 రైతు ఉద్యమంలో అసాంఘిక శక్తులు ప్రవేశించినట్లు స్పష్టం అవుతుంది. రైతు నాయకుల అదుపు నుండి ఉద్యమం పక్కదారి పట్టిన్నట్లు భావించవలసి వస్తున్నది.  ర్యాలీ రూటు మార్పులో తమ పాత్ర ఏదీ లేదని సంయుక్త కిసాన్‌ మోర్చ నాయకులు కూడా పేర్కొనడం గమనార్హం. కొంతమంది అరాచకవాదులు, అసాంఘిక శక్తులు తమ శాంతియుత ఉద్యమంలోకి చొరబడ్డాయని ఆరోపించారు.
 
 ముందుగా చెప్పిన స‌మ‌యం, దారుల్లో కాకుండా ముందుగానే ర్యాలీ మొద‌లుపెట్టి సెంట్ర‌ల్ ఢిల్లీలోకి రావ‌డానికి ప్ర‌య‌త్నించిన రైతుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జ్ చేయ‌డంతోపాటు టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. అయితే ఈ సంద‌ర్భంగా కొంద‌రు నిహంగ్ ఆందోళ‌న‌కారులు త‌మ ద‌గ్గ‌ర ఉన్న ఖ‌డ్గాల‌ను పోలీసుల‌పై దుయ్యడం గ‌మ‌నార్హం. 
 
వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు వైర‌ల్ అయ్యాయి. ఢిల్లీలోకి అక్ష‌ర్‌ధామ్ స‌మీపంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇక మ‌రోవైపు ఇద్ద‌రు రైతులు ట్రాక్ట‌ర్‌తో స్టంట్లు చేస్తుండ‌గా అది బోల్తా ప‌డింది. నిజానికి ఉద‌యం 11 గంట‌ల‌కు కిసాన్ ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉండ‌గా  ఉద‌యం 8 గంటల నుంచే వేలాది మంది రైతులు ఢిల్లీలోకి ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నించారు. 
 
ఐటీఓ వద్ద రైతులు పోలీసులపై కర్రలతో దాడికి దిగారు. అనేకమంది పోలీసులకు గాయాలయ్యాయి. దెబ్బలకు తాళలేక పోలీసులు పరుగులు తీశారు. వేలాది ట్రాక్టర్లతో రాజధానిలోకి వచ్చిన రైతులు పలు చోట్ల హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించినా అదుపులోకి రాలేదు. 
 
కొన్నిచోట్ల పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టినా ఢిల్లీ రోడ్లపైకి వేలాది ట్రాక్టర్లు వచ్చేశాయి. కొందరైతే ఏకంగా పోలీసులపైకే ట్రాక్టర్లు ఎక్కించేందుకు యత్నించారు.  ఎర్ర‌కోట ప్రాంగ‌ణానికి కూడా భారీ సంఖ్య‌లో రైతు ఆందోళ‌న‌కారులు వ‌చ్చారు.  అయితే కోట‌పైకి ఎక్కిన ఓ రైతు జెండాల‌ను పాతారు.   
 
సంజయ్‌గాంధీ ట్రాన్స్‌పోర్ట్ నగర్, అక్షర ధామ్ ఆలయం, ముకర్బా చౌక్ వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. చివరగా రైతులను నిలువరించేందుకు జలఫిరంగుల వాహనాలను పోలీసులు తెచ్చారు. జలఫిరంగుల వాహనాలపై రైతులు ఎక్కి జాతీయ పతాకాలతో రైతులు నినాదాలు చేశారు. ముకర్బా చౌక్ వద్ద పోలీసు బస్సు అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. రైతులకు పోలీసులు సహకరిస్తున్నట్టు ఢిల్లీ సంయుక్త సిపి వెల్లడించాడు. రైతులు కూడా పోలీసులకు సహకరించాలని సంయుక్త సిపి విజ్ఞప్తి చేశారు.
 
రైతుల ట్రాక్టర్ రిపబ్లిక్ డే ర్యాలీలో ఢిల్లీ ఐటీఓ సమీపంలో ఒక నిరసనకారుడు మరణించడం  మరింత ఆందోళనకు దారి తీసింది.ఢిల్లీ పోలీసులు జరిపిన కాల్పుల్లో  రైతు మృతి చెందారని  రైతు ఉద్యమకారులు ఆరోపించారు. మృతుడిని ఉత్తరాఖండ్‌లోని బాజ్‌పూర్‌కు చెందిన నవనీత్ సింగ్‌గా గుర్తించినట్టు చెప్పారు. అయితే ట్రాక్టరు తిరగబడటంతో రైతు చనిపోయాడని పోలీసులు వెల్లడించారు.
 
 రైతుల ర్యాలీ హింసాత్మకంగా మారడంతో పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపధ్యంలో శాంతి భద్రతల పరిస్థితుల దృష్ట్యా  కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖాజీపూర్, తిక్రిత్, సింగ్ నంగ్లోయి తదితర ప్రాంతాలలో అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. 
 
ఇక ఢిల్లీలోని మెట్రో సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. దిల్షన్ గార్డెన్, ఝిల్‌మిల్, మాన్‌సరోవర్ పార్క్, జామా మసీదుతో పాటు ‘గ్రే లైన్’లో ఉన్న అన్ని స్టేషన్లు మూసివేస్తున్నట్లు డీఎంఆర్‌సీ ప్రకటించింది. ఈ వివరాలను డీఎంఆర్‌సీ ట్విటర్ ద్వారా తెలిపింది.
 
 దేశ రాజధానిలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ పరేడ్‌ హింసాత్మకంగా మారడం పట్ల రైతు సంఘాల సమాఖ్య  విచారం వ్యక్తం చేసింది. రైతుల నిరసనలో హింస చోటుచేసుకోవడం ఆమోదయోగ్యం కాదని, ఈ ఘటనలను తాము ఖండిస్తున్నామని రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా ఓ ప్రకటనలో పేర్కొంది. రైతుల నిరసనలో అసాంఘిక శక్తులు ప్రవేశించి హింసకు పాల్పడ్డారని ఆరోపించింది. శాంతియుత నిరసనలకు తాము అన్ని చర్యలూ చేపట్టినా కొన్ని సంఘాలు, వ్యక్తులు నిర్ధేశిత మార్గంలో వెళ్లకుండా అవాంఛనీయ ఘటనలకు తెగబడ్డారని పేర్కొంది.
కిసాన్ ర్యాలీ హింసాత్మ‌కంగా మారిన నేప‌థ్యంలో కేంద్ర హోంశాఖ‌లోని సీనియ‌ర్ అధికారులు అత్య‌వ‌స‌రంగా సమావేశ‌మ‌య్యారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన స‌మాచారాన్ని వాళ్లు సేక‌రిస్తున్నారు. పారామిలిట‌రీ ద‌ళాల‌ను హైఅలెర్ట్‌లో ఉండాల‌ని ఆదేశించారు. ఎర్ర‌కోట ద‌గ్గ‌ర మ‌రిన్ని బ‌ల‌గాల‌ను మోహ‌రించారు.