చైనా ఏక‌ప‌క్షంగా ఎల్ఏసీని మారిస్తే సహించం 

ఏక‌ప‌క్షంగా ఎల్ఏసీని మారిస్తే దాన్ని స‌హించ‌బోమ‌ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనాను హెచ్చరించారు. స‌రిహ‌ద్దు వ‌ద్ద ఉద్రిక్త‌త‌లు త‌గ్గ‌డం అంత సులువైన విష‌యం కాదని కూడా స్పష్టం చేశారు.

 13వ చైనా అధ్యయనాల అఖిల భారత సమావేశంలో భారత్ -చైనా సంబంధాల‌పై ఇవాళ ఆన్‌లైన్ కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతూ వాస్త‌వానికి రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిన్నాయ‌ని, కానీ ఇప్పుడు ఈ రెండు దేశాలు తీసుకునే నిర్ణ‌యాలు చాలా దీర్ఘ‌మైన ప‌ర్య‌వ‌సానాల‌కు దారి తీస్తుంద‌ని చెప్పారు. దీని వ‌ల్ల‌ కేవలం రెండు దేశాల‌కే కాదు, యావ‌త్ ప్ర‌పంచంపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని జైశంక‌ర్  పేర్కొన్నారు.

స‌రిహ‌ద్దు అంశంలో చైనా ఎందుకు ఎలా ప్ర‌వ‌ర్తించింద‌న్న దానిపై ఇంత వ‌ర‌కు ఎటువంటి విశ్వ‌స‌నీయ స‌మాచారం లేద‌ని ఆయ‌న చెప్పారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కేవలం ఇచ్చిపుచ్చుకోవడం ఆధారంగా మాత్రమే వృద్ధి చెందుతాయని చెప్పారు. వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల దళాల ఉపసంహరణపై చర్చలు జరుగుతున్నప్పటికీ, సత్సంబంధాలు నిలకడగా, అభివృద్ధి చెందాలంటే, గత మూడు దశాబ్దాల్లో నేర్చుకున్నవాటిని పరిగణనలోకి తీసుకుని విధానాలను రూపొందించవలసి ఉంటుందని చెప్పారు. 

భారత్-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖపై ఉమ్మడి అవగాహనకు రావడంలో చెప్పుకోదగ్గ ప్రగతి కనిపించడం లేదని విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు ఏ స్థితిలో ఉన్నాయనే విషయంపై కచ్చితంగా ఏమీ చెప్పలేనని చెప్పారు. సత్సంబంధాలపై ప్రస్తుత ఆందోళన అయినా, దీర్ఘకాలంలో  సత్సంబంధాలు సాధ్యమయ్యే అవకాశం ఉన్నా, ఇరు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకోవడం ఆధారంగా మాత్రమే సత్సంబంధాలు బలపడతాయని స్పష్టం చేశారు. 

పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనాల ఆధారంగానే సంబంధాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. వీటిని పక్కనబెట్టి, ఎల్ఏసీ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉన్నా, కలవరం లేకుండా గడుపుదామనుకోవడం వాస్తవాలకు అతీతమైనదవుతుందని తెలిపారు. ఎల్ఏసీ వద్ద దళాల ఉపసంహరణ గురించి చర్చలు కొనసాగుతున్నాయని చెబుతూ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నిలకడగా వృద్ధి చెందాలంటే గత మూడు దశాబ్దాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని విధానాలను రూపొందించాలని చెప్పారు. 

ఇదిలావుండగా, ఆదివారం చైనావైపునగల మోల్డో-చూసుల్ సరిహద్దుల్లోభారత్-చైనా కార్ప్స్ కమాండర్ లెవెల్ సమావేశం జరిగింది. తూర్పు లడఖ్‌లోని సరిహద్దుల్లో ముందు వరుసలో ఉన్న దళాలను సత్వరమే ఉపసంహరించాలని అంగీకరించాయి. తొమ్మిదో రౌండ్ కార్ప్స్ కమాండ్ లెవెల్ చర్చలు సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ముగిశాయి. ఆదివారం ప్రారంభమైన ఈ చర్చలు మొత్తం మీద 15 గంటలకుపైగా కొనసాగాయి.