నిర్దిష్ట ప్రతిపాదనలతో వస్తేనే రైతులతో ఇక ప్రభుత్వం చర్చలు!

గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ అనూహ్యమైన హిమసయుత సంఘటనలకు దారితీయడంతో రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతు నాయకులతో చర్చలు జరిపే విషయంలో కేంద్ర ప్రభుత్వం కొంత కఠిన వైఖరి అవలంభించే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటి వరకు బేషరతుగా 11 సార్లు కేంద్ర మంత్రుల బృందం రైతు నాయకులతో చర్చలు జరపడం తెలిసిందే. 

అయితే ఇక నుండి రైతు చట్టాలను మొత్తంగా రద్దు చేయాలనే మొండి వైఖరితో కాకుండా, ఆ చట్టాలలో తీసుకు రావలసిన మార్పుల గురించి నిర్దిష్ట ప్రతిపాదనలతో వస్తేనే వారితో చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. చట్టంలో ప్రతి అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, రైతులకు ఇబ్బంది కలిగిస్తే అటువంటి అంశాలను సవరించడానికో లేదా తొలగించడానికో కూడా సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే కేంద్ర మంత్రులు పలు మార్లు స్పష్టం చేయడం గమనార్హం. 

అయితే 11 సార్లు చర్చలకు హాజరైన రైతు నాయకులు చట్టంలోని అంశాలను ఒకొక్కటిగా చర్చించడానికి విముఖత వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దానితో చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడి, ఎటువంటి పరిష్కారంపై రాలేక పోతున్నారు. 

ఇప్పుడు ఢిల్లీలో జరిగిన హింస రైతు నేతల నైతిక స్థైర్యంను దెబ్బ తీయడమే కాకుండా, వారిలో చీలికలు దారి తీసింది. తికాయత్ వంటి రైతు నాయకులే ఈ హింసకు కారణం అని ఆరోపిస్తూ రెండు రైతు సంఘాలు ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు కూడా ప్రకటించారు. మరికొన్ని సంఘాలు కూడా ఉద్యమం నుండి వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఢిల్లీ హింసకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన 25 ఎఫ్ ఐ ఆర్ లలో ప్రభుత్వంలో చర్చలలో పాల్గొన్న 40 మంది రైతు నాయకులలో 30 మంది పేర్లు ఉండడం గమనార్హం. వారిలో సంయుక్త కిసాన్ మోర్చా అధికార ప్రతినిధులు ఆరుగురు కూడా ఉన్నారు. మరో వంక ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో “పార్లమెంట్ కు మార్చ్” పేరుతో భారీ నిరసన ప్రదర్శన జరపాలన్న ప్రతిపాదనను కూడా రైతు సంఘాలు విరమించుకున్నాయి. 

రైతు ఉద్యమంలో  ఖలిస్థాన్ పాకిస్థాన్ అనుకూల శక్తులు జొరబడుతున్నట్లు మొదటి నుండి వస్తున్న ఆరోపణలు రిపబ్లిక్ డే నాటి హింసాయుత చర్యలు బలం చేకూర్చాయి. దానితో తమ ఉద్యమం పట్ల ప్రజలలో సానుభూతి కోల్పోతున్నామని రైతు నేతలు గ్రహించినట్లు కనబడుతున్నది. 

చర్చలకు తలుపులు మూసుకు పోలేదని కేంద్ర మంత్రి ప్రకాష్ జావెదకర్ చెప్పడం మినహా చర్చలకు సారధ్యం వహిస్తున్న వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రెండు రోజులుగా చర్చల అంశాన్ని ప్రస్తావించక పోవడం గమనార్హం. ఉద్యమంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న రైతు నేతలు అదుపు కోల్పోయిన్నట్లు స్పష్టం కావడంతో ప్రభుత్వ ధోరణి మరింత కఠినంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇప్పటికే చట్టాలలో పలు మార్పులు తీసుకు రావడానికి నిర్దుష్టమైన ప్రతిపాదనలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం రైతు నాయకుల పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరిస్తూ వస్తున్నదని, ఇప్పుడు రైతు నేతలే ఒక నిర్ణయం తీసుకో వలసి ఉన్నదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

ఇలా ఉండగా, ఉద్రిక్తతలకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆదేశించినట్లు తెలుస్తోంది.నిర్ణయించిన రూట్లలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి, ఆ హామీని నిలబెట్టుకోని రైతు సంఘాల నేతలపై పోలీసులు చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని ఓ సీనియర్ అధికారి చెప్పారు. 

అల్లర్లకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా హోం శాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు గల అవకాశాలపై న్యాయ శాఖ సలహాలు కూడా తీసుకొన్నట్లు తెలుస్తోంది. కారకులను సిసి టీవీ ఫుటేజి ఆధారంగా గుర్తించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని హోం శాఖ కార్యదర్శి ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

కాగా, ఢిల్లీలో చోటుచేసుకొన్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో  క్రాంతికారీ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు దర్శన్‌పాల్‌కు పోలీసులు నోటీసు జారీ చేశారు. ‘‘పోలీసులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారు. హింసకు బాధ్యులుగా భావిస్తూ మీతోపాటు మీ సంస్థలోని సభ్యులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు?. మీ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగింది. వీటిపై 3రోజుల్లోగా వివరణ ఇవ్వండి’’ అని నోటీసులో పేర్కొన్నారు. హింస వెనుక ఉన్న వారి పేర్లు తెలిస్తే చెప్పాలని కోరారు.