రాజ్యాంగంకు కట్టుబడమని ప్రభుత్వంకు చెప్పండి…. గవర్నర్ తో నిమ్మగడ్డ 

రాజ్యాంగంకు కట్టుబడమని ప్రభుత్వంకు చెప్పండి…. గవర్నర్ తో నిమ్మగడ్డ 

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో సంయమనం పాటించి,  రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని అధికారంలో ఉన్న పెద్దలకు చెప్పాల్సిందిగా గవర్నర్‌ను కోరినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వెల్లడించారు. ‘ఎన్నికల కమిషనర్‌ను వ్యక్తిగతంగా నిందించడం తగదు. ఇకనైనా ఒక లక్ష్మణ రేఖ వచ్చిందని భావించాలి’ అని కూడా సందేశం ఇవ్వమని కోరిన్నట్లు తెలిపారు. 

గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను కలిసిన విషయాన్ని మీడియాకు చెబుతూ  ప్రభుత్వానికి, ఎస్ఈసీకి వారదిగా ఉంటానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు రమేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. 

బుధవారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, పంచాయతీరాజ్‌, వైద్య ఆరోగ్యం తదితర శాఖల ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఎస్‌ఈసీ విధులకు భంగం కలిగిస్తే కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ తర్వాత మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. 

ప్రభుత్వం, ఉద్యోగుల పాత్రపై గవర్నర్ నిర్మాణాత్మక సూచనలు చేశారని చెబుతూ  ఆ సూచనలను పాజిటివ్ దృక్పథంతో స్వీకరించి ఎన్నికలను విజయవంతం చేయాలని భావిస్తున్నామని తెలిపారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆదిత్యానాథ్ దాస్‌తో వ్యక్తిగతంగా తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు.పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని, ఆ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ను బదిలీ చేసినట్లు ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలపై నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్పందించారు. ఆమంత్రి అలా చెప్పడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని రమేష్ కుమార్ స్పష్టం చేశారు.

‘ఆ అధికారులపై నేను చర్యలు తీసుకున్నది నిజమే. కానీ బదిలీ చేయలేదు. కేవలం అభిశంసించాను. మున్ముందు వారి పనితీరు బాగుంటే పునఃపరిశీలించవచ్చు. వాస్తవానికి ఈ రోజు కార్యక్రమాన్ని గిరిజాశంకరే నడిపారు. ఆయన ప్రతిష్ఠను పెంచడానికి ప్రయత్నించాను’ అని పేర్కొన్నారు. వాస్తవానికి తాను కూడా సర్వీసు మూలాల నుంచి వచ్చానని చెబుతూ 3.6 లక్షల మంది యువత ఓటు వేయలేకపోతున్నందుకే వారిపై అలా ప్రతిస్పందించానని తెలిపారు. 

‘‘ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరిస్తోంది. నేను కూడా ఉద్యోగినే. నాకు ఉద్యోగుల పట్ల వ్యతిరేక భావం లేదు. ప్రభుత్వంపై నా మనసులో ఎలాంటి కక్ష లేదు” అని స్పష్టం చేశారు. సుప్రీం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లే! దీనిని న్యాయస్థానానికి తెలియజేసే బాధ్యత తమకు ఉంటుందని అంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.తహశీల్దార్లు అభ్యర్థుల కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో అలసత్వం వహించినా.. ఫిర్యాదులు వచ్చినా… ఉపేక్షించబోమని హెచ్చరించారు.  ఏకగ్రీవాలు ఇంతకుముందు జరిగాయని, ఇకపై కూడా జరుగుతాయని స్పష్టం చేశారు. అయితే, ఏకగ్రీవాల పట్ల కొన్ని పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై అనేక ఆరోపణలున్నాయని గుర్తు చేశారు.  అసంబద్ధంగా పెరిగితే మాత్రం పరిశీలిస్తామని చెప్పారు. 

ఏకగ్రీవాలకు సిద్ధం కండి.. ప్రోత్సాహకాలు పెంచుతున్నామని, ఏకగ్రీవాలు చేసుకోండంటూ అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రభుత్వం ప్రకటనలిచ్చిన విషయమై నాలుగైదు పార్టీలు ఏకాభిప్రాయంతో ఫిర్యాదు చేశాయని కమిషనర్‌ తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిన తర్వాత ఏం చేయాలన్నా.. ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని, ఇది ప్రాథమిక విధి అని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రభావితం చేసేలా ఉండడం సరికాదంటూ సదరు ప్రకటనలపై సమాచార పౌరసంబంధాల కమిషనర్‌ను సంజాయిషీ కోరినట్లు చెప్పారు.