ఢిల్లీలో పోలీసుల భద్రత కట్టుదిట్టం

దేశరాజధానిలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా నిన్న ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎర్రకోట వద్ద భద్రతను పటిష్టం చేశారు.

ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు గస్తీ పెంచారు. ఘజియాబాద్‌ మండి, జాతీయ రహదారి 9, జాతీయ రహదారి 24లను పోలీసులు మూసివేశారు. ఈ రహదారులపై ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని ప్రకటించారు. దీంతో ఢిల్లీ నుంచి ఘజియాబాద్‌ వైపు వస్తున్న ప్రయాణికులు షాహదార, కర్కారి, డీఎన్‌డీ వైపు నుంచి రావాలని వాహనదారులకు సూచించారు. 

కాగా, సింఘు, , టిక్రి సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో రైతుల దీక్షా శిబిరాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. నిన్నటి ఘటన దృష్ట్యా పలు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.  రైతుల ఆందోళనల నేపథ్యంలో బుధవారం ఢిల్లీలోని లాల్‌ఖిలా, జామామసీద్ మెట్రో స్టేషన్లను మూసివేస్తూ ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) నిర్ణయం తీసుకుంది. లాల్‌ఖిలా, జామామసీద్ మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్  గేట్లను మూసివేశామని డీఎంఆర్సీ బుధవారం ట్వీట్ చేసింది. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో హోమ్ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు గత రాత్రి అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ముందస్తుగా అదనపు బలగాలను మోహరించాలని నిర్ణయించారు. సుమారు 15 కంపెనీల పారా మిలిటరీ బలగాలను దేశ రాజధానిలో మోహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.  10 కంపెనీల సిఆర్‌పిఎఫ్, 5 కంపెనీల రెండో తరహా పారా మిలిటరీ బలగాలను మోహరించనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

నిన్నటి ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై ఇప్పటివరకు పోలీసులు 22 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశామని, ఈ హింసలో మొత్తం 300 మంది వరకు పోలీసులు గాయపడ్డారని ఢిల్లీ పోలీస్ అదనపు పీఆరో అనిల్ మిట్టల్ తెలిపారు. . ఇందులో 5 కేసులు తూర్పు ఢిల్లీ పరిధిలో నమోదయ్యాయి. ప్రతి కూడలిలో సిసిటివి కెమెరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. భారత్ వ్యతిరేక ప్రచారం చేస్తున్న ఖలిస్థాన్ మద్దతుదారుల ట్విట్టర్ ఖాతాలను కూడా నిలిపివేస్తున్నారు.

కాగా, ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీలో ఉద్రిక్తతతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. సోన్‌పట్‌, పాల్వాల్‌, ఝజ్జర్‌ జిల్లాల్లో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. సాయంత్రం 5 గంటలవరకు ఇంటర్‌నెట్‌, ఎస్‌ఎంఎస్‌‌ సర్వీసులు రద్దుచేశారు. శాంతిభద్రతలకు ఆటంకం కలుగకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు.