కశ్మీర్‌లో అల్లర్లకు ఐఎస్‌ఐ కుట్ర బహిర్గతం

జమ్ముకశ్మీర్‌లో మతాన్ని అడ్డం పెట్టి అల్లర్లు సృష్టించడానికి పాకిస్తాన్‌ చేసిన కుట్ర బహిర్గతమైంది. మత విభేదాలను సృష్టించి ఉగ్రవాద గ్రూపులను బలోపేతం చేయాలన్నది పాకిస్తాన్‌కు చెందిన గూఢచారి ఏజెన్సీ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తేలింది.
ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్‌లోని హిందూ ఆలయాలపై దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తున్నది. అయితే, భారతదేశం చేపడుతున్న తీవ్రవాద నిరోధక చర్యలతో తీవ్రంగా నష్టపోయిన ఉగ్రవాదుల్లో మనోధైర్యాన్ని నింపుతూ, భద్రతా సంస్థలపై ఉగ్ర దాడులను కొనసాగించేందుకు ఐఎస్ఐ చేసిన ప్రణాళికలను భద్రతాదళాలు ఆదిలోనే అడ్డుకుని బట్టబయలు చేశాయి.
జమ్ములో ఉగ్రవాద గ్రూపులను బలోపేతం చేసేందుకు పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. జమ్ములో ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు కశ్మీర్‌ సెల్‌ ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా పనిచేసే జమ్ముకశ్మీర్‌ ఘజనావి దళం బాధ్యత వహించింది. ఈ నెల 13 న కోట్లీలోని పాకిస్తాన్ ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంలో ఐఎస్ఐకి చెందిన మేజర్ కమ్రాన్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. జమ్ము ప్రాంతంలో జనవరి 26 న ఉగ్ర దాడులను ఎలా జరుపాలనే విషయాలను చర్చించినట్లు సమాచారం.
పూంచ్, రాజౌరి సెక్టార్లలో టెర్రర్ మాడ్యూళ్ళను యాక్టీవ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వీరి సమావేశాన్ని బట్టి తెలుస్తున్నది. హిందూ ఆలయాలపై దాడులకు తెగబడుతూ భద్రతాదళాలపై దాడులు చేయడం ద్వారా జమ్ముకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు ఐఎస్‌ఐ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు భారత్‌ భద్రతాదళాలు గుర్తించాయి.
ఈ నెల ప్రారంభంలో ఉమర్ అహ్మద్ మాలిక్, సుహైల్ అహ్మద్ మాలిక్ అనే ఇద్దరు ఉగ్రవాదులను జమ్ము పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మొహమ్మద్ మార్గదర్శకత్వంలో వీరిద్దరూ పనిచేస్తున్నట్లు గుర్తించారు. వీరి నుంచి రెండు ఏకే-47, ఒక పిస్టల్, 16 గ్రనేడ్లు, 19 ఏకే-మ్యాగజైన్స్, 269 లైవ్ బుల్లెట్లు, 2 మ్యాగజైన్స్ స్వాధీనం చేసుకున్నారు. సాంబా సెక్టార్‌లోని విజయ్‌పూర్ ప్రాంతంలో డ్రోన్ల సాయంతో పాకిస్తాన్ రేంజర్స్ పంపగా తాము అందుకున్నామని వీరిద్దరూ దర్యాప్తులో వెల్లడించారు.