లైంగిక దాడిపై వివాదాస్పద హైకోర్టు తీర్పుపై స్టే 

లైంగిక దాడిపై వివాదాస్పద హైకోర్టు తీర్పుపై స్టే 

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం నిలిపేసింది. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసేందుకు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు అనుమతి ఇచ్చింది. హైకోర్టు తీర్పు ప్రమాదకరమైన దృష్టాంతంగా నిలుస్తుందని కేకే వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు.

దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వివాదాస్పదంగా మారిన అంశంపై తుది విచారణ ముగిసే వరకు స్టే విధిస్తున్నట్లు తెలిపారు. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆందోళనకరంగా ఉందని, దీనిపై మరోసారి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని కేకే వేణుగోపాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

బోంబే హైకోర్టు ఈ నెల 19న ఈ వివాదాస్పద తీర్పును ఇచ్చింది. మైనర్ బాలిక వక్షోజాలను నేరుగా చర్మంతో చర్మాన్ని తాకకుండా, చేతులతో తడమడాన్ని లైంగిక దాడిగా అభివర్ణించజాలమని పేర్కొంది. ఇటువంటి చర్యను లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ (పోక్సో) చట్టం నిర్వచించిన లైంగిక దాడిగా పరిగణించజాలమని తెలిపింది.

 ఏదైనా చర్యను లైంగిక దాడిగా పరిగణించాలంటే, ఆ చర్య తప్పనిసరిగా శృంగార భావనతో నేరుగా చర్మంతో చర్మాన్ని తాకేవిధంగా ఉండాలని, కేవలం చేతులతో తడమటం కాదని జస్టిస్ పుష్ప గనేడివాలా చెప్పారు. కోర్టులో బాధిత బాలిక (12) ఇచ్చిన సాక్ష్యాన్ని జస్టిస్ పుష్ప ప్రస్తావిస్తూ, తినుబండారం ఇస్తానన్న నెపంతో బాధిత బాలికను నిందితుడు నాగపూర్‌లోని తన ఇంటికి తీసుకెళ్ళాడని తెలిపారు. 

ఆ వ్యక్తి ఆమె వక్షోజాలను గట్టిగా పట్టుకున్నాడని, ఆమె దుస్తులను తొలగించేందుకు ప్రయత్నించాడని తన తీర్పులో రికార్డు చేశారు. ఆమె దుస్తులను తొలగించకుండా ఆమెను తడిమాడని, ఈ నేరాన్ని లైంగిక దాడిగా అభివర్ణించజాలమని పేర్కొన్నారు. ఈ నేరాన్ని ఇండియన్ పీనల్ కోడ్, సెక్షన్ 354 ప్రకారం ఓ మహిళ మర్యాదను భంగపరచడంగా పేర్కొన్నారు. 

క్రింది కోర్టు ఈ కేసులో నిందితుడిని దోషిగా తీర్పు చెప్తూ, మూడేళ్ళ జైలు శిక్ష విదించింది. ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం కనీసం ఒక ఏడాది జైలు శిక్ష విధించవవలసి ఉంటుంది, పోక్సో చట్టం ప్రకారం లైంగిక దాడి నేరానికి కనీసం మూడేళ్ల జైలు శిక్ష విధించాలి. దోషికి ఈ రెండు చట్టాల ప్రకారం శిక్ష విదించగా, హైకోర్టు తీవ్ర నేరారోపణల నుంచి నిందితునికి విముక్తి కల్పించింది. 

ముంబై హైకోర్టు తీర్పుపై సినీ నటి తాప్సితో పాటు గాయని చిన్మయి వంటి వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత సమయంలో ఇలాంటి తీర్పులు రావడం ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. దీనిపై యూత్‌ బార్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ఇండియా సైతం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.