ట్రాక్టర్ ర్యాలీని హైజాక్ చేసేందుకు పాక్ కుట్ర 

రిపబ్లిక్‌ డే రోజున ఢిల్లీలో రైతులు చేపట్టనున్న ట్రాక్టర్‌ ర్యాలీకి అంతరాయం కలిగించేందుకు, హైజాక్‌ చేయడానికి యత్నిస్తున్న పాక్‌కు చెందిన 300 ట్విటర్‌ గ్రూప్‌లను గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 
దీంతో పటిష్టమైన భద్రతల మధ్య మంగళవారం ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించబడుతుందని స్పెషల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ దీపేంద్ర పాథక్‌ తెలిపారు. 
ప్రజలను తప్పుదోవ పట్టించడం ద్వారా రైతుల ట్రాక్టర్‌ ర్యాలీకి అంతరాయం కలిగించేందుకు జనవరి 13 నుండి 18 వరకు పాక్‌ నుండి 300కి పైగా ట్విటర్‌ గ్రూపులు పలు మెసేజ్‌లు పంపినట్లు గుర్తించామని ఆయన వెల్లడించాయిరు. పాక్‌కు చెందిన పలు ఉగ్రవాద గ్రూపుల నుండి కొన్ని మెసేజ్‌లు వచ్చాయని, ఇవి ర్యాలీలో ఇబ్బందిని సృష్టించగలవనే బెదిరింపులతో ఉన్నాయని తెలిపారు. 
 
దీంతో శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చని, ఇది తమకు సవాలుగా మారిందని చెప్పారు. రిపబ్లిక్‌ డే పరేడ్‌ ముగిసిన అనంతరం కఠినమైన భద్రతల మధ్య ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించబడుతుందని పాథక్‌ మీడియాకు తెలిపారు.  
పొరుగు రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్‌, యుపిల నుండి రైతులు చారిత్రాత్మక ర్యాలీలో పాల్గనేందుకు వస్తున్నారని రైతు సంఘాలు తెలిపాయి. రింగ్‌ రోడ్‌లో ప్రశాంతంగా ర్యాలీ జరుపుకునేందుకు పోలీసులు అనుమతించారని, రైతులంతా క్రమశిక్షణతోనూ, కమిటీ చేసిన సూచనలకు అనుగుణంగా ర్యాలీలో పాల్గొనాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ పేర్కొంది.