జైలులో క్షీణించిన లాలూ ఆరోగ్యం

పశుగ్రాసం కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్నబీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్ రాంచీకి వచ్చారు. లాలూకు మెరుగైన చికిత్స జరిపించేందుకు వీలుగా తేజస్వీయాదవ్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను కలవనున్నారు. 

‘‘ నా తండ్రి లాలూకు మెరుగైన చికిత్స చేయించాలనేది మా కుటుంబ నిర్ణయం. అన్ని పరీక్షల రిపోర్టులు చూస్తే మా తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. అందుకనే మెరుగైన చికిత్స చేయించాలని నేను ముఖ్యమంత్రి సోరెన్ ను కలిసి విన్నవిస్తాను’’ అని తేజస్వీ చెప్పారు. గతంలో లాలూకు గుండె ఆపరేషన్ చేశారు.

 కిడ్నీలు దెబ్బతినడంతోపాటు నిమోనియా సోకడంతో శ్వాసకోశ సమస్య ఏర్పడింది. రాంచీ ఆసుపత్రిలో లాలూను అతని భార్య రబ్రీదేవి, కుమార్తె మీసాభారతి, కుమారులు తేజస్వీ, తేజ్ ప్రతాప్ యాదవ్ లు చూసి పరామర్శించారు. 

ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న లాలూయాదవ్ కు చికిత్స చేస్తున్నామని, అతని పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెపుతున్నారు. లాలూ చికిత్స గురించి తేజస్వీ యాదవ్ సీఎంతో పాటు జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నాగుప్తాను కూడా  కలవనున్నారు. కాగా లాలూ కిడ్నీలు 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని వైద్యుడు డాక్టర్ ఉమేష్ ప్రసాద్ చెప్పారు.