ఢిల్లీలోని ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడిచేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి ఢిల్లీ కోర్టు ఈ రోజు రెండేళ్ల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా వెంటనే బెయిలు కూడా మంజూరు చేసింది.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 9 సెప్టెంబరు 2016లో సోమనాథ్ భారతి, మరో 300 మంది కలిసి జేసీబీ ఆపరేటర్ సాయంతో ఎయిమ్స్ ప్రహరీకి ఉన్న ఫెన్సింగును తొలగించారు. ఈ క్రమంలో అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేసినట్టు ఎయిమ్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆర్ఎస్ రావత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసును విచారించిన కోర్టు ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందుకు గాను సోమనాథ్ భారతిని దోషిగా నిర్ధారించింది. ఐపీసీ సెక్షన్ 323, 353, 147 కింద కేసులు నమోదయ్యాయి. సోమనాథ్ భారతిపై నమోదైన అభియోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించడంతో మేజిస్ట్రేట్ ఏకీభవించి తీర్పును వెలువరించారు.
ఈ కేసులో గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉండగా, అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే, ఇదే కేసులో సహ నిందితులైన జగత్ సైనీ, దిలీప్ ఝా, సందీప్ సోను, రాకేశ్ పాండేలపై తగిన సాక్ష్యాధారాలు లేనందున నిర్దోషులుగా ప్రకటించారు.
More Stories
తుది దశకు చేరుకున్న వామపక్ష తీవ్రవాదం
దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ
గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన భగవత్