మే 15 నుంచి 20 వరకు ప్రధాని మోదీ ఐదు దేశాల్లో పర్యటన

మే 15 నుంచి 20 వరకు ప్రధాని మోదీ ఐదు దేశాల్లో పర్యటన

మే 15 నుంచి 20 వరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆరు రోజుల పాటు ఐదు కీలక దేశాల్లో పర్యటించనున్నారు. మే 15వ తేదీన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో ప్రారంభమయ్యే ఈ పర్యటన నెదర్లాండ్స్, స్వీడన్, నార్వేల మీదుగా సాగి మే 20వ తేదీన ఇటలీతో ముగియనుంది.  మే 15వ తేదీన ప్రధాని మోదీ తొలుత యూఏఈ అధ్యక్షుడిని కలుస్తారు.

ఇంధన సహకారం, వాణిజ్యం, 4.5 మిలియన్ల భారతీయ సమాజ సంక్షేమంపై చర్చించనున్నారు. భారత్‌కు 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న యూఏఈతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం.

అక్కడి నుంచి మే 15వ తేదీన నెదర్లాండ్స్ వెళ్తారు. 17వ తేదీ వరకు అక్కడే పర్యటిస్తారు. రక్షణ, గ్రీన్ హైడ్రోజన్, సెమీకండక్టర్లు, ‘నీటి నిర్వహణ’పై వ్యూహాత్మక ఒప్పందాలను సమీక్షించనున్నారు. నెదర్లాండ్స్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మే 17వ తేదీ రోజు స్వీడన్ వెళ్తారు. 18 తేదీల్లో స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌లో ప్రధాని పర్యటిస్తారు. గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అంతరిక్షం, రక్షణ రంగాల్లో పెట్టుబడులే లక్ష్యంగా చర్చలు సాగతాయియి. అలాగే ఐరోపా పారిశ్రామిక వేత్తల రౌండ్ టేబుల్ సమావేశంలో ఈయూ కమీషన్ ప్రెసిడెంట్‌తో కలిసి ఆయన ప్రసంగించనున్నారు.

ఈ పర్యటనలో అత్యంత విశేషంగా నార్వే పర్యటన నిలవబోతోంది. 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నార్వే వెళ్లడం ఇదే తొలిసారి. మే 18వ తేదీన ఆయన నార్వేకు చేరుకుని 19వ తేదీన నార్వే రాజుతో పాటు ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అదే సమయంలో ఓస్లోలో జరిగే ‘3వ భారత్-నార్డిక్ సమ్మిట్’లో మోదీ పాల్గొంటారు. డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ ప్రధానులు కూడా ఈ సదస్సుకు రానున్నారు.

పర్యటన చివరి రోజైన మే 20వ తేదీన ప్రధాని మోదీ ఇటలీ చేరుకుంటారు. ప్రధాని జార్జియా మెలోనితో కలిసి ‘జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-2029’ అమలుపై సమీక్ష నిర్వహిస్తారు. రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఇటలీతో భారత్ సంబంధాలను ఈ పర్యటన మరింత పటిష్టం చేయనుంది. మొత్తానికి ఐరోపా దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో.. ఈ పర్యటన భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.