
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పశ్చిమ బెంగాల్లో ప్రధాన పార్టీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం ఉదయం కొందరు బీజేపీ కార్యకర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో హౌరాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ కోల్‌కతాలోని టాలీగుంజ్ ప్రాంతంలో జరిగిన ఓ రోడ్‌షా వద్ద కొందరు టీఎంసీ జెండాలు చేతబూని రాళ్ల దాడికి పాల్పడిన కొద్దిరోజులకే ఈ ఘటన చోటుచేసుకుంది. హౌరా ఘటన వెనుక అధికార టీఎంసీ కార్యకర్తలే ఉన్నారంటూ బీజేపీ ఆరోపిస్తోంది.
దుండుగులు జరిపిన కాల్పుల్లో తమ పార్టీ కార్యకర్తకు గాయాలయ్యాయని బీజేపీ ఆరోపించింది. దీనిని పోలీసులు ధ్రువీకరించలేదు.బుల్లెట్ గాయమైందని చెబుతున్న వ్యక్తిని చికిత్స కోసం హౌరా దవాఖానకు తరలించారు. కొందరు రాడ్లు, స్టిక్‌లతో దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బల్లీ వద్ద జరిగిన ప్రదర్శనపై ఆంగతకులు బాంబులు విసిరారన్న వార్తల నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. ఈ ఘటన నేపథ్యంలో హౌరాలో భారీగా పోలీసులను మోహరించారు.
‘‘మా కార్యకర్తలపై ఇవాళ దాడి జరిగింది. టీఎంసీ నేతలు తమ వైఖరి మార్చుకోకపోతే.. వాళ్లకు కూడా ఇదే భాషలో సమాధానం చెప్పాల్సి ఉంటుంది…’’ అని బీజేపీ స్థానిక నేత ఒకరు హెచ్చరించారు. దాడికి నిరసనగా బీజేపీ కార్యకర్తలు రోడ్లను దిగ్బంధించి నిరసనకు దిగారు. రోడ్లపై టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు.
కోల్‌కతాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సరిగ్గా కొద్ది గంటల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, మతాబెనర్జీ క్యాబినెట్ నుంచి మంత్రిగా దోమ్‌జూర్ ఎమ్మెల్యే రజీబ్ బెనర్జీ రాజీనామా చేసిన వెంటనే బల్లీ ఎమ్మెల్యే బక్షి దాల్మియాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ శుక్రవారం సస్పెండ్ చేశారు.
More Stories
దేశ పౌరులు చట్టం తమదేనని భావించాలి
హత్యకు ముందు భారత్ పై దాడులకు నిజ్జర్ భారీ కుట్రలు
బీజేపీ మహిళా కార్యకర్తలకు ప్రధాని మోదీ పాదాభివందనం!